వైద్యుల కొరత

– దేశవ్యాప్తంగా ఆస్పత్రుల వద్ద రోగుల పడిగాపులు
– గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దుర్భరం
ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా మోడీ ప్రభుత్వం ప్రయివేటుకు కట్టబెడుతున్నది. దేశ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వైద్యరంగాన్ని కూడా గాలికొదిలేయటానికి సిద్ధమైంది. ఒకవైపు నిర్వహణకు తగిన కేటాయింపులు లేక,మరోవైపు వైద్యుల్లేక, సిబ్బందీ లేక సర్కారు దవాఖానాలు మూలనపడుతుంటే.. బాగు చేయటానికి ఏమాత్రం శ్రద్ధచూపటంలేదు. విరాళాల రూపంలో వేల కోట్ల నిధులు పీఎం కేర్స్‌ ఖజానాకు చేరుతున్నా..వాటిని ప్రభుత్వ దవాఖానాలకు వినియోగించకుండా ప్రయివేటుకు ధారపోస్తోంది.ప్రజలన్నా, ప్రజల ఆరోగ్యమన్నా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపులేని వ్యవహారంగా మారింది.
న్యూఢిల్లీ :
రోగులకు అవసరమైన ప్రత్యేక చికిత్సల కోసం కేంద్రం ఎయిమ్స్‌ తరహాలో వైద్య సంస్థలను నిర్మిస్తున్నప్పటికీ వాటిలో తగినంత మంది వైద్యులను నియమించకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. బీహార్‌కు చెందిన 21 సంవత్సరాల మిథలేష్‌ చౌదరి కథ వింటే రోగులు ఎంత నిస్సహాయ, దయనీయ పరిస్థితులలో ఉన్నారో అర్థమ వుతుంది. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం చౌదరి తన తాతతో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్‌ గేటు ఎదుట రెండు రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకోవాల్సి వచ్చింది. వారే కాదు…మరో వంద మంది రోగులదీ అదే పరిస్థితి. ఛాతి సమస్యతో బాధపడుతున్న చౌదరి చికిత్స కోసం ఎయిమ్స్‌కు వచ్చాడు. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్‌ నుంచి వచ్చి గేటు వద్ద పడిగాపులు పడుతున్నా ఎవరూ కనికరించడం లేదు. తెల్లవారుజామునే క్యూలో నిలబడడం, తన వంతు వచ్చే సరికే స్లాట్లు అయిపోవడం జరుగుతోంది. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగానే అతనికి సకాలంలో అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు.ఇది దేశంలో వైద్యుల కొరతకు,రోగుల అవసÊథకు ఓ ఉదాహరణ మాత్రమే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో వైద్యులు, సిబ్బంది కొరత అధికంగా ఉంది. 1991 లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది రోగులకు 1.2 మంది డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. 2020 నాటికి జనాభా పెరగడంతో ఈ దామాషా 0.7కి పడిపోయింది. అదే చైనాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 2.4 మంది డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా మార్చిలో పార్లమెంటులో మాట్లాడుతూ దేశంలో ప్రతి 834 మంది రోగులకు ఒక వైద్యుడు ఉన్నాడని, ఇది డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువేనని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చెప్పిన వైద్యులలో సంప్రదాయిక వైద్యం అందిస్తున్న ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి వైద్యులు కూడా ఉన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వంటి సంస్థలు సంప్రదాయ వైద్యులను లెక్కలోకి తీసుకోవడం లేదు.
వాస్తవానికి వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయివేటు, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసింది. ఈ సంస్థలలో ప్రవేశం కోసం గత సంవత్సరం 17.6 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయినప్పటికీ ఫిబ్రవరిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులలో మూడు వేల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఖాళీల సంఖ్య 21 వేలకు పైనే. బీహార్‌లోని భాగల్పూర్‌ జిల్లాలో ఉన్న 800 పడకల జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో కావాల్సిన వైద్యులలో సగం మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుల పైనే అధిక పనిభారం పడుతోంది. పైగా వీరు అండర్‌ గ్రాడ్యుయేట్లకు పాఠాలు కూడా బోధించాల్సి ఉంది. పెద్ద నగరాలకు వెలుపల ఉన్న ఆస్పత్రులలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత సంవత్సరం మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాలలో సర్జన్లు, ఫిజీషియన్లు, స్త్రీల వ్యాధుల నిపుణులు, పిల్లల వ్యాధుల నిపుణుల కొరత 80 శాతం వరకూ ఉన్నదని ప్రభుత్వమే అంగీకరించింది. ప్రభుత్వ సమాచారం ప్రకారం చిన్న ఆస్పత్రులలో 21,920 మంది నిపుణులు అవసరం కాగా 4,485 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. నిపుణులైన వైద్యులు మెట్రోపాలిటన్‌, ఇతర పెద్ద నగరాలలో పని చేసేందుకు విదేశాలకు క్యూ కడుతున్నారు. గ్రామాలలో వైద్యుల కొరత ఎక్కువగా ఉండడంతో రోగులు పట్టణ ప్రాంతాలలోని ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడి ఖర్చులతో వీరి జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడమంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అక్కడ పరీక్షలు, వైద్యుల ఫీజులు, ఇతర వైద్య సేవలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే వైద్యులు అందుబాటులో ఉంటే చాలా కేసులను ప్రాథమిక స్థాయిలోనే నయం చేయవచ్చునని ఎయిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ చెబుతున్నారు.

Spread the love