వెంటనే విడుదల చేయాలి

should be released immediately– పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, రీయింబర్స్‌మెంట్‌
– నాణ్యతలేని ‘మన్న ట్రస్ట్‌’ మధ్యాహ్న భోజనం
– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెండింగ్‌లో ఉన్న రూ.5,177 కోట్ల స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి లను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు మన్న ట్రస్ట్‌ ద్వారా సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని, వెంటనే కాంట్రాక్టును రద్దు చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌లో సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం యూనివర్సిటీ ఫీజులు పెంచి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని విమర్శించారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో భారీగా పెంచిన ఫీజులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో మూడు రోజులు నిర్వహిం చిన అధ్యయన యాత్రలో వెలుగులోకి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఒక్క బిల్డింగ్‌లోనే మూడు నుంచి నాలుగు గురుకుల పాఠశాలలు కొనసాగు తున్నాయన్నారు. 1200 నుంచి 2వేల మంది విద్యార్థులకు ఒక్కరే ప్రిన్సిపాల్‌, ఆరుగురు టీచర్లు, మరికొంత మంది కాంట్రాక్ట్‌ టీచర్లు మాత్రమే ఉండటం సిగ్గు చేటన్నారు. ఇలా ఉంటే విద్యార్థు లకు చదువులో ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన్న ట్రస్ట్‌ ద్వారా సరఫరా చేస్తున్న మధ్యాహ్న బోజనం నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులు అన్నం కూడా తినడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మన్న ట్రస్టు కాంట్రాక్టును రద్దు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు.సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు సరిపడా కూరలు, గుడ్లు, పండ్లు ఇవ్వడం లేదన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కార్తీక్‌, జిల్లా సహాయ కార్యదర్శులు అరుణ్‌, వంశీ, జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్‌, శివ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love