విద్యుత్‌ ఆర్టిజన్లను కన్వర్షన్‌ చేయాలి

Electrical Artisans Conversion should be done – నేటి ”చలో విద్యుత్‌ సౌధ”కు సీపీఐ(ఎం) మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యుత్‌ ఆర్టిజన్లను వెంటనే కన్వర్షన్‌ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్హతలను బట్టి విద్యుత్‌ ఆర్టిజన్లను కన్వర్షన్‌ చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన చలో విద్యుత్‌ సౌధ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో సుమారు 20 వేల మంది విద్యుత్తు ఆర్టిజన్లు ఏడేండ్లుగా పని చేస్తున్నారని వివరించారు. ఈ కార్మికులందరూ గతంలో 15 నుంచి 20 ఏండ్లపాటు విద్యుత్‌ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేశారని గుర్తు చేశారు. ఒకే సంస్థ, ఒకే సర్వీస్‌ రూల్‌ పద్ధతిని అనుసరించి ఇప్పటికే వారిని కన్వర్షన్‌ చేయాల్సి ఉన్నదని తెలిపారు. ఈ 20 వేల మందికి కన్వర్షన్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపైనగానీ, యాజమాన్యంపైనగానీ ఎలాంటి ఆర్థిక భారం పడబోదని స్పష్టం చేశారు. ఆర్టిజన్లను కన్వర్షన్‌ చేయాలని కోరుతూ గత ఐదు నెలలుగా ముఖ్యమంత్రి, మంత్రులకు, అధికారులకు వినతిపత్రాలతోపాటు పలు రకాల పోరాటాలను చేస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో చలో విద్యుత్‌ సౌధ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. వారి సమస్యల తీవ్రతను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తక్షణమే స్పందించి దీర్ఘకాలంగా విద్యుత్తు విభాగంలో పనిచేస్తున్న ఆర్టిజన్లను కన్వర్షన్‌ చేసేందుకు ట్రాన్స్‌కో యాజమాన్యానికి తగు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.అంతకుముందు తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీజీఎస్‌యూఈఈ యూ) ప్రతినిధి బృందం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని కలిశారు. ఆర్టిజన్ల సమస్యతో పాటు విద్యుత్‌ కార్మికులు, ఉద్యోగుల ఇతర సమస్యల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యల్ని తీసుకెళ్లాలని కోరారు. ఆర్టిజన్ల కన్వర్షన్‌ డిమాండ్‌ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నదనీ, దాని సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. జాన్‌ వెస్లీని కలిసిన వారిలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కే ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవర్థన్‌, టీజీఎస్‌ఎన్పీడీసీఎల్‌ కంపెనీ ఉపాధ్యక్షులు కర్నాల అనిల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Spread the love