రహదారి మరమ్మతులు పట్టవా..?

Should the road be repaired?– ప్రమాదకరంగా ఖమ్మం-బోనకల్‌ రోడ్డు
– 18 మంది ప్రాణం పోయినా పట్టని మంత్రి, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్‌
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
– రోడ్డు కోసం పాదయాత్ర ప్రారంభం
నవతెలంగాణ- చింతకాని
ఖమ్మం-బోనకల్‌ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి జనం ప్రాణం కోల్పోతున్నా జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్‌, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు బాధ్యత లేకుండా పోయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. అధ్వానంగా ఉన్న ఖమ్మం-బోనకల్‌ ప్రధాన రహదారి మరమ్మతుల చేపట్టాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పందిళ్ళపల్లి నుంచి నాగులవంచ వరకు చేపట్టిన పాదయాత్రను పోతినేని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం- బోనకల్‌ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే రహదారులను విస్మరించి కార్పొరేట్లకు చెందిన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. మంత్రి పువ్వాడ కేవలం ఖమ్మం నియోజకవర్గం మంత్రి కాదని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ రోడ్డు మార్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో రోడ్ల సమస్య పరిష్కరించకుండా రాష్ట్ర సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నానని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ లింగాల కమల్‌రాజు కనీసం ఈ రోడ్డు మరమ్మతులపై నోరు మెదపకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఆరు నెలల వ్యవధిలో 18 మంది మృతిచెందడంతోపాటు చాలా మంది గాయపడ్డారని, అయినా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మధిర నియోజకవర్గ కన్వీనర్‌ పాలడుగు భాస్కర్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణం కోల్పోతున్నా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. తక్షణమే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని, ఖమ్మం-బోనకల్‌ రహదారి దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, నాయకులు వత్సవాయి జానకి రాములు, తోటకూరి వెంకట నరసయ్య, ఆలస్యం రవి, నన్నక కృష్ణమూర్తి, దేశబోయిన ఉపేందర్‌, రాచబంటి రాము, లింగం కోటేశ్వరరావు, కాటబత్తిని వీరబాబు, కూచిపూడి బుచ్చిబాబు, మద్దిన్ని బసవయ్య, పులి యజ్ఞ నారాయణ, వాక సీతారామిరెడ్డి, పంగా గోపయ్య, కిరణ్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love