తల్లీ, భార్య నగలమ్మి ‘ఇమ్రోజ్’ ఉర్దూ దిన పత్రిక స్థాపించి, ధిక్కార గొంతుకను వినిపించినందుకు ఉన్మాద మూక కత్తులకు బలైన స్వేచ్ఛా పిపాసి షోయబుల్లాఖాన్. ఇప్పటికి 75 ఏండ్ల క్రితం భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనం కావాలని, అందుకు నిజాం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. ఇట్లా స్వేచ్ఛగా రాసినందుకు, రజాకార్ల దోరణిని తప్పుపట్టినందుకు, విమర్శిస్తూ వ్యాసాలు, సంపాదకీయాలు రాసినందుకు ఆగస్టు 22, 1948 నాడు రజాకార్ల చేతిలో హతమయిండు. పోరాటానికి, త్యాగానికి చిహ్నమైన 28 యేండ్ల షోయబుల్లాఖాన్ గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరమున్నది.
రాజకీయ ఉద్ధండులు బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు తదితరుల ఆర్థిక, హäర్థిక సహాయంతో ‘ఇమ్రోజ్’ తొలి సంచిక 1947 నవంబర్, 15 నాడు వెలువడింది. అప్పటికే హైదరాబాద్ అంతటా ఉద్రిక్త వాతావరణం ఉండింది. ఒక వైపు భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చింది. మరోవైపు హైదరాబాద్ అంతటా రజకార్ల దారుణాలు నిత్యకృత్యమైనాయి. మతోన్మాద ప్రకటనలు జోరందుకున్నాయి. ఎర్రకోటపై ‘అసఫ్‌జాహీ’ జెండా ఎగరేస్తామని కాసిమ్ రజ్వీ భీరాలు పలికిండు. మరోవైపు ఆర్యసమాజీయులు కొందరు 1947 డిసెంబర్‌లో నిజాంపై హత్యాయత్నం చేసిండ్రు. ఈ దశలో కాంగ్రెస్ నాయకులెవ్వరూ హైదరాబాద్‌లో లేరు. అందరూ తమ నివాసాన్ని మద్రాసు, విజయవాడ ప్రాంతాలకు మార్చిండ్రు. కొందరు సరిహద్దుల్లో క్యాంపులు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎదిరించిండ్రు. మరోవైపు సాయుధ పోరాటం సాగుతూ ఉన్నది. ఇట్లా ఇంటా, బయటా రెండు ప్రాంతాల్లోనూ నిజాం ప్రభుత్వం సమస్యలను ఎదుర్కొన్నది. హింసాకాండా రోజు రోజుకు పెచ్చరిల్లూతూ పోతూ ఉండింది. ఈ సంక్షుభిత కాలంలో ప్రారంభమైన ‘ఇమ్రోజ్’ ప్రజల గొంతుకగా మారింది. ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో భాగం కావాలని కూడా సంపాదకీయాలు రాసిండు. అట్లా విలీనం కానట్లయితే అది నిజాం ప్రభువుకు ఆత్మహత్యా సదృశంగా మారుతుందని కూడా హెచ్చరించాడు. అటు ‘రాత్‌కి సర్కార్ – దిన్ కి సర్కార్’ పేరిట పగలు నిజాం ప్రభుత్వం, రాత్రి కమ్యూనిస్టుల రాజ్యం తెలంగాణ/హైదరాబాద్ రాజ్యంలో నడుస్తున్నదని విమర్శించిండు.
అంతేగాదు ఏ మత మౌఢ్యమైనా ప్రజలకు వీసమెత్తు మేలు చేయదని షోయబ్ నమ్మిండు. అందుకే ఇత్తెహాదుల్ సంస్థ, దాని నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలను ఎండగడుతూ వ్యాసాలు రాసిండు. బాకర్ అలీ మీర్జా మరికొంత మంది మత సామరస్యాన్ని కాపాడాలని జారీ చేసిన కరపత్రాన్ని ధైర్యంగా పత్రికల్లో ప్రచురించిండు. ఇవన్నీ ఉన్మాదంతో కండ్లు మూసుకు పోయిన మూకను మరిత రెచ్చగొట్టినట్లయింది. రెచ్చిపోయిన మతోన్మాదులు షోయెబుల్లా ఖాన్‌ని కాచిగూడా ప్రాంతంలో హతమార్చిండ్రు. హైదరాబాద్‌పై భారత ప్రభుత్వం పోలీసు చర్య పేరిట సైన్యాన్ని పంపి పాలనను తమ అధీనంలోకి తీసుకోవడానికి ఈ సంఘటన ప్రధాన కారణాల్లో ఒకటి.
షోయబుల్లా ఖాన్ హత్య ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు, పత్రికా స్వేచ్ఛకు పెద్ద విఘాతం. ఆయన చనిపోయి 75 ఏండ్లయిన తర్వాత కూడా ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని మీడియా ఎదుర్కొంటున్నది. రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19(1)ఎ లో కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో మనం మరింతగా షోయబుల్లా ఖాన్ లాంటి త్యాగధనుల స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి. ఇది సెక్యులర్ శక్తులు ప్రస్తుత మతోన్మాద సందర్భంలో చేయాల్సిన అవసరమైన పని. కానీ ఇప్పుడు సైతం ఉన్మాద శక్తులు ముందున్నాయి. షోయబ్ హత్యను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు.
ఇవ్వాళ కొన్ని రాజకీయ పార్టీలు షోయబుల్లాఖాన్ తమ సొంత కార్యకర్త అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నది. ఆయన్ని ఓన్ చేసుకుంటున్నాయి. కానీ ఏ పార్టీ కూడా ఆయన పేరిట జాతీయ స్థాయిలో పత్రికా స్వేచ్ఛకు ప్రాణమిచ్చిన వారికి ఒక అవార్డు ఇవ్వడం లేదు. షోయబ్‌ని ఓన్ చేసుకుంటున్న పార్టీల్లో బిజెపి ముందువరుసలో ఉన్నది. అందుకే నేషనల్ బుక్ ట్రస్ట్ తరపున ఆయన జీవిత చరిత్రను రాయించేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. ఆయన వెలువరించిన పత్రికల ప్రతులన్నింటినీ సేకరించి వాటిలోని సంపాదకీయాలను, వ్యాసాలను తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో వెలువరించినట్లయితే ఆయన త్యాగం ఎక్కువమందికి తెలిస్తుంది. ఇప్పుడు ఆయన స్ఫూర్తిని, జ్ఞాపకాన్ని తెలియజెప్పేందుకు అదొక్కటే మార్గం.
– డా|| సంగిశెట్టి శ్రీనివాస్, 9849220321