ఎంపీపీ పిలుపుతో శ్రమదానం..

కాచనపల్లి గ్రామంలో శ్రమదానం
కాచనపల్లి గ్రామంలో శ్రమదానం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి పిలుపు మేరకు మంగళవారం మండలంలోని అనంతోగు గ్రామపంచాయతీ, గుండాల మండల పరిధిలోని కాచనపల్లి గ్రామ పంచాయతీల మధ్య సుమారు 6 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డుకి ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను స్థానిక ఎంపీడీవో రామారావు, ఎంపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 6 జీపీల కార్యదర్శులు దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులచే శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అనంతోగు, కాచనపల్లి మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రధానంగా గత నెల లోపు ఇద్దరు మృత్యువాతకు గురయ్యారని, మరికొందరు వికలాంగులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా సోమవారం తిర్లాపురం గ్రామానికి చెందిన కుంజ నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్ర్భాంతికి గురయ్యానని చెప్పారు. సంబంధిత అధికారులకు రోడ్డుకు సంబంధించిన నిధులతో రోడ్డుకిరువైపులా పిచ్చి మొక్కలు తొలగించమని గతంలో పలు మార్లు చెప్పినా పెడచెవిన పెట్టారని మండి పడ్డారు. దాంతో స్థానిక మండల పరిషత్ నిధులతో నైనా ఆ రోడ్డు ప్రాంతంలో రెండు రోజుల పాటు శ్రమదాన కార్యక్రమం చేపడదామని సూచించడంతో మంచి మనసుతో ముందుకు వచ్చిన ఎంపీడీవో, ఎంపీఓ పై ఎంపీపీ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే 6 జీపీల కార్యదర్శులను సైతం అభినందించారు. అనంతరం ఈ శ్రమదానానికి వివిధ గ్రామపంచాయతీ ద్వారా రెండు బ్లేడ్ ట్రాక్టర్లను ఉపయోగించడం జరిగినదని, ఈ కార్యక్రమం రెండు రోజులపాటు జరుగుతుందని ఎంపీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ శ్రమదానంలో అనంతోగు సర్పంచ్ గలిగె సమ్మక్క, పంచాయతీ కార్యదర్శులు త్రివేణి, ప్రవీణ్, రమేష్, అనురాధ, జీవన్, విజయ కుమారి,  మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, శోభన్, 6 గ్రామ పంచాయతీల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love