ప్రాణం తీసిన శ్రీరామ్‌ చిట్‌ఫండ్‌ జమానాత్‌

– ఈఎంఐ కట్టకపోవడంతో జమానాత్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా
– అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ- నల్లగొండ
చిట్టి ఎత్తుకున్న వ్యక్తి నెలసరి ఈఎంఐ కట్టకపోవడంతో.. అతనికి జమానత్‌ ఉన్న మరో వ్యక్తి అకౌంట్‌లో నుంచి చిట్టి వ్యాపారులు డబ్బులు డ్రా చేయడంతో ఆ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ రౌతు గోపి తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ పట్టణంలోని బీటీఎస్‌ దుర్గా కాలనీకి చెందిన పప్పుల ఓం ప్రకాష్‌(53) నల్లగొండ మున్సిపాలిటీలో వాటర్‌ పిట్టర్‌ పనిచేస్తున్నాడు. అదే ఆఫీసులో పనిచేస్తున్న సహ ఉద్యోగి చింత ఎల్లయ్యకు శ్రీరామ్‌ చిట్‌ఫండ్‌లో జమానత్‌ ఉన్నాడు. ఎల్లయ్య చిట్టి నెలసరి ఈఎంఐ కట్టకపోవడం వల్ల, జమానత్‌ ఉన్న ప్రకాష్‌ ఎకౌంట్‌ నుంచి చిట్టి వ్యాపారులు రూ.10వేలు కట్‌ చేసుకున్నారు. ఈ విషయంపై ఎల్లయ్యను ప్రకాష్‌ నిలదీసినా స్పందించలేదు. కాగా, ప్రెగెంట్‌ అయిన ఆయన కూతుర్ని అతని భార్య మెడికల్‌ చెకప్‌ల కోసం సోమవారం హైదరాబాద్‌ తీసుకెళ్లింది. దాంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రకాష్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ప్రకాష్‌ తలుపు తీయకపోవడంతో ఆయన కుమారుడు చరణ్‌ తేజ్‌ అనుమానంతో డోరు సందులోంచి చూడగా ప్లాస్టింగ్‌ ప్యాకింగ్‌ వైరుతో ఫ్యానుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దాంతో కుమారుడు మరొక డోర్‌ ఓపెన్‌ చేసి చూసేసరికి అప్పటికే ఆయన మృతిచెంది ఉన్నాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love