భావ లయల ‘శృతిగీతం’

విజయ అరళి ‘శృతిగీతం’ కవితా సంకలనం లయాత్మకమైన సరికొత్త భావాలను ఆవిష్కరించిన పుస్తకం. పక్షులతో, జంతువులతో, క్రిమికీటకాలతో సంభాషించాలనే ఆశ ప్రస్పుటమవుతుంది. తన పెరట్లోని కాకరకాయలో కొత్త పెళ్ళికూతుర్ని చూస్తారు. అప్పుడే మొలచిన మెంతాకును ముచ్చటగా నవ్విస్తారు. పెరట్లోని కొబ్బరాకుతో చందమామను సందుల్లో దాచేసి పల్లికిలింపజేయిస్తారు. గాలితో తగువాడింప జేస్తారు. ‘కమ్యూనికేషన్‌’లో ‘మాట్లాడలేని చాలా ప్రాణుల్ని/మాట్లాడించాలి అనిపిస్తుంది/ప్రకృతిలో జీవమున్న ప్రతీ ప్రాణిని/పలకరించాలనిపిస్తుంది… అంటారు. వానపాట, నిన్నటి వెన్నెలవాన, గాలి కబుర్లు, చందమామ కథ, నీలితీగ, పొద్దటి జ్ఞాపకం, హాయి రాగం, పడుచుగీత, తేనెపిట్ట ఊయల… వంటి కవితలు ప్రకృతితో జీవితాల్ని కూడగట్టుతాయి. ‘మనసున్న గిన్నె’లో ప్రకృతిని మనిషి యొక్క కష్ట-సుఖాలను వొలకబోసే ఒక గిన్నెగా చూడగలగటం అద్భుతం. పురుషాధిక్యతపై, సామాజిక ఒడిదుడుకులపై ఎక్కుపెట్టారు. ‘కెజి 100 రూపాయలు” కవితలో వీధుల్లో తిరుగుతూ పండ్లు అమ్ముకున్నట్టే స్వేచ్ఛను అమ్ముకునే కాలం దాపురించిన వైనం, ‘స్వేచ్ఛ అమ్మా స్వేచ్ఛ/కెజి 100 రూపాయలు’… ‘అబ్బో చాలా చీఫ్‌/ కొనుక్కోగలిగినవారు అదృష్టవంతలు మరి’! అంటూ ఈ దుష్ట సమాజంపై వ్యంగాస్త్రం సంధిస్తారు. ‘స్వంత శైలి’లో గడచిపోయిన జీవిత కాలమంతా మసకబారిన కాలమే. ఏమీ గుర్తుంచుకునేంత గొప్పది కాదు అంటూ.. ”దుర్భిణీ వేసి వెతుక్కున్నా మరువలేని/సంతోషాలేవీ అదమబడి లేవు ఆ దొంతరలో… అంటూ ఆవేదన వ్యక్తపరుస్తారు. ఇలా విసుగు ముసిరిన రాత్రి, ‘సం’దేహాలు, అక్షరాల వాన, ఏదైనా రాయాలనిపిస్తుంది, శాశ్వత చిహ్నాలు… వంటి అనేక కవితల్లో జీవిత రహస్యాల్ని కళ్లకద్దుతారు. ఇలాంటి అనేక కవితులు కలగలిపి ‘కవితల పొట్లం’ కట్టేశారు విజయ అరళి గారు. అన్నీ ఒకటికి రెండు సార్లు చదవాలి అనే కవితలే. హిందీ కవయిత్రి మహాదేవీ వర్మ ప్రకృతిని తన ప్రేమికుడిగా వర్ణిస్తుంది. విజయ అరళి తోటి మనిషినే ప్రకృతితో పోలుస్తారు. సరళమైన భాష, ఆంగ్లపదాలతో జోడించిన శీర్షికలు పాఠకుల హృదయాలను నిస్సందేహంగా హత్తుకుపోతాయి. ఇంకా విభిన్న కోణాలతో మరెన్నో ‘కవితల పొట్లాలు’ పంచి పాఠకులను అలరింపచేస్తారని ఆశిద్దాం.

Spread the love