– సోనియా నేతృత్వంలో సీఈసీ భేటీ
– మిగిలిన నాలుగు స్థానాలపై నిర్ణయం
– డిల్లీకి సీఎం రేవంత్, డీప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ సీట్ల పంచాయితీకి నేడు శుభం కార్డు పడనుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. సోమవారం ఢిల్లీలో జరగనున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ó, కేసీ.వేణుగోపాల్, అంబికా సోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొనే ఈ సమావేశంలో మిగిలిన నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను కాగ్రెస్ ఇప్పటికే మూడు విడుతలుగా 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ స్థానాలకు నేడు అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వంకాయలపాటి రాజేందప్రసాద్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబాల నుంచి ముగ్గురు టికెట్ ఆశిస్తుండటంతో వారందరినీ పక్కన పెట్టి రాజేంద్రప్రసాద్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్ సీటు కోసం బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు డి. సాంబయ్య, అద్దంకి దయాకర్ పోటీ పడుతున్నారు. ఇది ఇలాఉండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు అతని కూతురు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మొదటి నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వారికి ఆశా భంగం తప్పదని రాజకీయ వర్గాలంటున్నాయి. పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ పసూనూరి సీటు గ్యారెంటీతోనే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చివరి వరకు ఎవరికి సీటు దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ టికెట్ కోసం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సంతోష్ కుమార్ మొదటి నుంచి పోటీ పడుతున్నారు. అల్గిరెడ్డి పేరు ఖరారైందని వార్తలు వచ్చినప్పటికి చివరి క్షణంలో తీన్మార్ మల్లన్న పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మస్కతితో పాటు ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. అనూహ్యంగా ఈ స్థానం నుంచి ఓ టెన్నిస్‌స్టార్‌తో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్, షానవాజ్ తుబుసుంపేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించిన ఏఐసీసీ, వారిచ్చిన సలహాలు, సూచనల మేరకు తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజా బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవలు, విధేయత తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని చర్చించి సీట్లపై అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరగనున్న సీఈసీ భేటీలో మిగిలిన నాలుగు సీట్లకు అభ్యర్ధులు ఖరారయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.