ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

SI constable in ACB net– స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.10 వేల లంచం
నవతెలంగాణ-లింగంపేట్‌
స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. లింగంపేట్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ను, కానిస్టేబుల్‌ రామస్వామిని గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ నిజామాబాద్‌ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై గతంలో పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రామస్వామి డబ్బులు డిమాండ్‌ చేశారు. అందుకు ఇష్టపడని బాధితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం బాధితుడి నుంచి పోలీస్‌ స్టేషన్లో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వారిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను హైదరాబాద్‌ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేష్‌, వేణు కుమార్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మూడు నెలల కిందటే బదిలీపై రాక
మూడు నెలల కిందటే సిద్దిపేట కమిషన్‌ పరిధిలో పీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ అరుణ్‌ కుమార్‌ బదిలీపై లింగంపేట్‌కి వచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా పేకాట రాయులను పట్టుకున్న స్పెషల్‌ పార్టీ పోలీసులు స్థానిక పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చి రోడ్డుపై ఆందోళన చేపట్టినట్టు తెలిసింది. కాగా లింగంపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ఎస్‌ఐలను ఏసీబీ అధికారులు పట్టుకోవడం గమనార్హం.

Spread the love