– ములుగు జిల్లా వాజేడు మండలంలో సంఘటన
– ఎస్‌ఐ మృతిపై పలు అనుమానాలు
నవతెలంగాణ-వాజేడు
వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామం సమీపంలో సోమవారం జరిగింది. కాగా, ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయనతో పాటు యువతి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ఎస్‌ఐ మృతికి యువతి కారణం అయి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. రిసార్ట్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం వెంకటరాజపల్లి గ్రామానికి చెందిన ఎస్‌ఐ హరీశ్.. ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి పూసూరు గ్రామం సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్స్‌లో ఆయన రూమ్ తీసుకొని ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన రూమ్ నుంచి గన్ పేలిన శబ్దం రావడంతో రిసార్ట్ సిబ్బంది.. మాస్టర్ కీతో ఎస్‌ఐ రూమ్ తెరిచి చూడగా.. బెడ్‌పై విగతజీవిగా ఎస్‌ఐ ఉండటాన్ని గుర్తించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. మృతుని అన్న కుమార్ వచ్చేవరకు తరలించొద్దని అంబులెన్స్ వద్ద బైటాయించారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్‌ఐ తిరుపతి.. కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్పీ శబరిష్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రుద్ర హరీష్ (28) వ్యక్తిగత కారణాలతో సర్వీస్ రివర్‌తో సూసైడ్ చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. కాగా, రిసార్ట్స్ రూమ్‌లో ఆయనతోపాటు ఓ యువతి ఉన్నట్టు సమాచారం.