– నిధుల కొరతతో కునారిల్లుతున్న రాష్ట్రాలు
– పులి మీద పుట్రలా జీఎస్టీ
– కేంద్రం దయాదాక్షిణ్యాల పైనే ఆధారం
న్యూఢిల్లీ : వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రాణాంతక వ్యాధి సోకిందంటే పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే. అప్పో సప్పో చేసి దవాఖానాకు పోయినా ప్రాణం నిలబడుతుందన్న ఆశ లేదు. అప్పు మాత్రం భూతంగా వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఆరోగ్యం, ఆరోగ్య రక్షణ బాధ్యతలను కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా రాజ్యాంగపరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌లు) ద్వారా ఆరోగ్య రక్షణలో కేంద్రం పాత్ర పెరుగుతోంది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రవేశపెట్టడం, 14వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాల్లో మార్పులు వచ్చాయి. పన్నుల పంపిణీలో కేంద్రం పాత్ర, ఆధిపత్యం క్రమేణా పెరుగుతుండటంతో రాష్ట్రాలు కేంద్రంపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రాష్ట్రాలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేసుకోగలిగేవి. కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చేవి. అయితే మార్పులు చేసిన తర్వాత కేంద్రం నుండి నిధుల బదిలీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ఆరోగ్య రక్షణ, విద్య వంటి కీలక రంగాలపై అధిక మొత్తాన్ని ఖర్చు చేయలేకపోతున్నాయి. ఆస్పత్రుల నిర్మాణానికి, పరికరాలు-మందుల కొనుగోలుకు, వైద్యులు-నర్సుల జీతాలకు ఎక్కువ నిధులు అవసరమవుతాయి. కానీ కావాల్సిన సొమ్ము మాత్రం రాష్ట్రాల వద్ద ఉండడం లేదు.
కేటాయింపులేవి?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో ఆరోగ్యంపై భారీ ప్రకటనలేవీ కన్పించలేదు. గత సంవత్సరంతో పోలిస్తే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేవలం 0.3 శాతం మాత్రమే కేటాయింపులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కేటాయింపులు 1.8 శాతం పెరిగాయి. అయితే స్థూల దేశీయోత్పత్తిలో మాత్రం కేటాయింపులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత సంవత్సరం జీడీపీలో 0.26 శాతం కేటాయిస్తే ఇప్పుడు 0.27 శాతం కేటాయించారు. పేద రాష్ట్రాల వద్ద ఆర్థిక వనరులు ఉండవు. కాబట్టి అవి కేంద్రం మద్దతు కోసం ఎదురు చూస్తుంటాయి. ఆరోగ్య రంగంపై చేస్తున్న వ్యయానికి సంబంధించి రాష్ట్రాల మధ్య అసమానతలు ఎక్కువగానే ఉన్నాయి. కేంద్రం అందిస్తున్న మద్దతు వీటిని పెద్దగా తగ్గించలేకపోతోంది.
కేంద్రం పైనే ఆధారం
రాష్ట్రాల సొంత వనరులు, కేంద్రం నుంచి జరుగుతున్న నిధుల బదిలీలు…ఈ రెండూ ఆరోగ్య వ్యయంపై ప్రభావం చూపుతున్నాయని న్యూఢిల్లీకి చెందిన సామాజిక, ఆర్థిక పురోగతి కేంద్రం (సీఎస్‌ఈపీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాల సొంత ఆదాయం ఒక శాతం పెరిగితే ఆరోగ్య రంగంపై చేసే ఖర్చు 0.20 శాతం పెరుగుతుందని ఆ అధ్యయనం వివరించింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం బేషరతుగా బదిలీ చేసే నిధులను ఒక శాతం పెంచితే అవి తమ తలసరి ఆరోగ్య వ్యయాన్ని 0.28 శాతం పెంచుతాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కేంద్రం సాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. నిధుల రాబడిలో ఎదురయ్యే ఇబ్బందులు, అనిశ్చిత పరిస్థితులను అవి తట్టుకోలేవు. ఇందుకు భిన్నంగా ఆర్థికంగా బలంగా ఉన్న హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాలు అధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. వ్యయానికి సంబంధించిన నిర్ణయాలలో వాటికి స్వతంత్రత, స్థిరత్వం ఉంటుంది.
ఆర్థిక వనరుల కొరత
ఆర్థిక వనరుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మంది వైద్య సిబ్బందిని కూడా నియమించలేకపోతున్నాయి. వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ వారిలో చాలా మంది అధిక జీతాల కోసం ప్రయివేటు రంగం వైపు చూస్తున్నారు. వైద్యులు మాత్రమే కాదు…నర్సులు, ఫార్మసిస్టుల వంటి ఇతర ఉద్యోగుల కొరత కూడా రాష్ట్రాలను వేధిస్తోంది.
జీఎస్టీతో కుదేలు
ఆరోగ్య రంగంపై వ్యయాన్ని 8 శాతానికి పెంచాలని సిఫార్సులు ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలు గత 30 సంవత్సరాల్లో తమ బడ్జెట్లలో కేవలం 3.5-5.5 శాతాన్ని మాత్రమే కేటాయించాయి. పేద రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటక సైతం ఆరోగ్యంపై తక్కువ ఖర్చు చేశాయి. జీఎస్టీని ప్రవేశపెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది. కీలక రంగాలకు కేటాయింపులు పెంచుదామని అనుకున్నా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 2014-15, 2020-21 మధ్యకాలంలో ఆరోగ్య రంగంపై కేంద్రం రాష్ట్రాలకు బదిలీ చేసిన వాటా 62.7 శాతం (2014-15) నుంచి 48.7 శాతానికి (2022-23) పడిపోయింది.