పెట్రోల్‌ ధర పెంపు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు : సిద్ధరామయ్య కౌంటర్‌

నవతెలంగాణ – బెంగళూరు : కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం రెండురోజుల క్రితం పెట్రోల్‌ డీజిల్‌పై లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచింది. పెట్రోల్‌ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సోమవారం బీజేపీ నేత అర్‌ ఆశోక్‌ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అశోక్‌తోపాటు, పలువురు నేతుల కార్లకు బదులుగా ఎడ్లబండిపై ఫ్రీడం పార్క్‌ వద్దకు చేరుకుని.. సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు.. ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, బీజేపీ నేతల నిరసనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై మూడు రూపాయల సేల్స్‌ ట్యాక్స్‌ పెంచాం. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల కంటే.. తక్కువే ఉంది. బీజేపీ నేతలు దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. బీజేపీ నేతలు మాట్లాడే ముందు.. కేంద్రం పెంచిన అదనపు సుంకాలపై కామెంట్స్‌ చేస్తే బాగుండేది. పలు సందర్భాల్లో రాజకీయ కారణాల దృష్ట్యా ప్రధాని మోడీ పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు సుంకాన్ని పెంచారు. దాదాపు పదిసార్లు కంటే ఎక్కువసార్లే పెంచారు. అలాంటప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు. కేంద్రం పన్నులు విధించిన కారణంగా.. మేము 1,87,00,000 కోట్లు పోగొట్టుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనులకోసం, ప్రజల శ్రేయస్సు కోసమే ట్యాక్స్‌ పెంచాం’ అని అన్నారు.

Spread the love