– భూ నిర్వాసితులందరికీ ప్యాకేజీలు వెంటనే ఇవ్వాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-గజ్వేల్
సిద్దిపేట జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, భూనిర్వాసితులందరికీ ప్యాకేజీలు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు మహాసభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అంతగిరిసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, కాలువలు, ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల భూమిని సేకరించారని అన్నారు. కానీ రైతులకు, నిర్వాసిత కుటుంబాలకు, యువతకు పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వలేదని ఆరోపించారు. మూడు, నాలుగు ఏండ్లు గడిచినా.. ఇప్పటికీ ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని అన్నారు. కనీసం ఈ ప్రభుత్వమైనా సమస్యల పరిష్కారం చూపాలని కోరారు. జిల్లాలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల అమలుకు నోచుకోవడం లేదని, ఉద్యోగ భద్రత లేదన్నారు. వేలాది మంది కార్మికులు ఉన్నప్పటికీ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ హాస్పిటల్ లేదన్నారు. బీడీ, హమాలీ భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్టు కార్మికులకు భద్రత లేదని, వారి భద్రతకు సమగ్ర బీమా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ, మున్సిపల్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విద్యుత్ రంగాల సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు రూ.26 వేలు అమలు చేసి, కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతాంగం, ఉపాధి కార్మికుల సమస్యల పరిష్కార కోసం భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, శశిధర్ గోపాలస్వామి, ఎల్లయ్య, భాస్కర్ సత్తిరెడ్డి బండ స్వామి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.