– ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే
– బంగారు తెలంగాణ : మంత్రి కేటీఆర్
– మిషన్ భగీరథకు పునాది ఇక్కడే
– 2014లో ఐటీ ఎగుమతులు రూ.56వేల
– కోట్లు..తొమ్మిదేండ్లలో 2.41 లక్షల కోట్లకు
– హరీశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
– ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే బంగారు తెలంగాణ :ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-కొండపాక
తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేట జన్మనిచ్చి ఒక నాయకున్ని ఇచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో బొగ్గులోని బండలో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేటను చూసి అసూయపడేలా మంత్రి హరీశ్‌రావు అభివృద్ధి చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి అని, ఓ వైపు పంచాయతీ అవార్డులు.. మరోవైపు పట్టణ ప్రగతి అవార్డులు జాతీయ స్థాయిలో మనకు వస్తున్నాయని తెలిపారు. సిద్దిపేట స్ఫూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్ఛబడి ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1980లో సిద్దిపేట అభివృద్ధి మొదలైందని, మిషన్ భగీరథకు పునాది పడ్డది కూడా సిద్దిపేటలోనే అని తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టిందన్నారు. రాబోయే ఎన్నికల్లో హరీశ్ రావుని లక్షా 50 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. ఐటీ హబ్‌ను ఇంకా విస్తరిస్తామని, టాస్క్‌తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉంటే ఈ తొమ్మిదేండ్లలో రూ.2.41 లక్షల కోట్లు ఉందన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదని, కానీ తెలంగాణలో 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. యువతకు ప్రయివేట్ ఉద్యోగం సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కలలో కూడా సిద్దిపేటకి ఐటీ టవర్ వస్తుందని అనుకోలేదని, ఇదంతా సీఎం కేసీఆరే చలవేనని తెలిపారు. సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరికొన్ని పరిశ్రమలు తెస్తామన్నారు. దేశ విదేశాల్లో పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, శాంతిభద్రతల గురించి తెలియజేసి ఎన్నో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చారని తెలిపారు. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటోందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఎస్‌ఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, జెడ్పీ చైర్మెన్ రోజా రాధాకృష్ణ శర్మ, టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.