సీఎంగా సిద్ధూ…డిప్యూటీగా డీకే

– 20న ప్రమాణస్వీకారం కర్నాటకానికి ఎట్టకేలకు తెర
న్యూఢిల్లీ/బెంగళూరు :
కర్నాటక కథ సుఖాంతమైంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకూ పోటీ పడిన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం బెంగళూరులో గురువారం సమావేశమై సిద్ధరామయ్యను నేతగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్‌పీ ఇదివరకే తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మద్దతు తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చర్చించి చివరికి సిద్ధూ పేరును ఖరారు చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని సమాచారం. ఈ కార్యక్రమానికి భావసారూప్యత కలిగిన పార్టీలను ఆహ్వానిస్తామని కాంగ్రెస్‌ తెలిపింది. ఈ వేడుక ప్రతిపక్షాల ఐక్యతకు మరో వేదికగా మారుతుందని భావిస్తున్నారు.
సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేశామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కర్నాటక వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణదీప్‌ సుర్జేవాలా సంయుక్తంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకూ శివకుమార్‌ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని వేణుగోపాల్‌ చెప్పారు. అంతకుముందు సిద్ధరామయ్య, శివకుమార్‌లు వేణుగోపాల్‌ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. సిద్ధరామయ్య, శివకుమార్‌ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటారంటూ అంతకుముందు వచ్చిన వార్తలను వేణుగోపాల్‌ కానీ, సుర్జేవాలా కానీ ధృవీకరించలేదు. ప్రజలతో అధికారాన్ని ఎలా పంచుకోవాలన్న విషయం పైనే అధిష్టానం చర్చించిందని వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. ఇరువురు నేతల మధ్య అధికారం కోసం జరిగిన పోటీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తమది ప్రజాస్వామిక పార్టీ అని, తమకు ఏకాభిప్రాయం పైనే తప్పించి నియంతృత్వంపై నమ్మకం లేదని చెప్పారు. గత రెండు మూడు రోజులుగా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ విజయం కోసం సిద్ధరామయ్య, శివకుమార్‌ చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఇద్దరూ సీఎం పదవికి అర్హులేనని చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశామని వివరించారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేయడం ఇది రెండోసారి. గతంలో ఆయన జనతాదళ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మొత్తం 13 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2006లో జనతాదళ్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2013 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి 122 స్థానాలు అందించిన సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ నాయకత్వం ముఖ్యమంత్రిగా నియమించింది.

Spread the love