ఎస్‌ఎఫ్‌ఐ రాజ్‌భవన్‌ ముట్టడి..

Siege of SFI Raj Bhavan– ఉద్రిక్తం..
– విద్యార్థి నేతలు మూర్తి, నాగరాజు సహా పలువురి అరెస్టు
– ఎన్‌ఈపీని రద్దు చేయాలి
– ఫెడరల్‌ వ్యవస్థలో గవర్నర్ల జోక్యాన్ని తగ్గించాలి

– విభజన హామీలను కేంద్రం అమలు చేయాలి : విద్యార్థుల డిమాండ్‌
– అక్రమ అరెస్టులను ఖండిస్తూ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020) రద్దు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్‌భవన్‌ లోపలికి వెళ్లేందుకు ఆ సంఘం నాయకులు యత్నించారు. ఫ్లకార్డులు ప్రదర్శించి ‘ఎన్‌ఈపీని రద్దు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి’అంటూ నినాదాలు చేశారు. అప్పటికే పెద్దఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ సంఘం నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దొరికిన వారిని దొరికినట్టుగానే ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు, ఉపాధ్యక్షులు తాటికొండ రవి, సంతోష్‌ రాథోడ్‌, కె ప్రశాంత్‌, సహాయ కార్యదర్శులు కె అశోక్‌రెడ్డి, బి శంకర్‌, కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం మమత సహా పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మూర్తి, నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కరోనా సమయంలో పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చ లేకుండానే ఆమోదించిన ఎన్‌ఈపీని తక్షణమే రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఈపీ అమల్లోకి వస్తే ప్రభుత్వ విద్యారంగం మరింత సంక్షోభంలోకి వెళ్తుందనీ, కార్పొరేట్‌, ప్రయివేటు విద్యారంగం మరింత బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా విద్యారంగం మరింత వ్యాపారంగా మారుతుందన్నారు. ఇంకోవైపు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్‌ఈపీలో ప్రాథమిక స్థాయిలోనే ఫౌండేషన్‌ కోర్సు పేరుతో అంగన్‌వాడీ వ్యవస్థను రద్దు చేసి విద్యను కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి తీసుకెళ్లే కుట్ర చేసిందని విమర్శించారు. పాఠశాల విద్యకు సంబంధించి చదువు మధ్యలో మానేసి వృత్తివిద్యాకోర్సులను తీసుకోవచ్చనే నిబంధనతో డ్రాపౌట్లు పెరుగుతారని చెప్పారు. ఎన్నైనా ప్రయివేట్‌ వర్శీటీలను ఏర్పాటు చేసుకోవచ్చనే నిర్ణయంతో విద్య మరింత ప్రయివేటుపరం అవుతుందని విమర్శించారు. విదేశీ వర్శీటీలు రావడం వల్ల ఫీజులు భారీగా పెరుగుతాయనీ, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతారని అన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత విద్యాసంస్థలను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర విద్యార్థులకు ఫెలోషిప్‌లను విడుదల చేయాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేసి చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనీ, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. ఫెడరల్‌ వ్యవస్థలో గవర్నర్ల జోక్యాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లెనిన్‌, కార్తీక్‌, కెవై ప్రణరు, రాష్ట్ర కమిటీ సభ్యులు రవినాయక్‌, రమ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
విద్యార్థులపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం శ్రేణులను కోరింది.
టీపీటీఎల్‌ఎఫ్‌ ఖండన
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఏ విజరుకుమార్‌ ఖండించారు. విద్యార్థులకు గొడ్డలిపెట్టుగా ఉన్న ఎన్‌ఈపీని రద్దు చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Spread the love