– స్వాధీనం చేసుకున్న ఎఫ్‌డిఐసి
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌విబి) సంక్షోభంతో మూత పడింది. ఈ బ్యాంక్‌ను మూసి వేస్తూ.. పూర్తిగా తమ ఆధీనంలో కి తీసుకున్నామని శుక్రవారం అమెరికా రెగ్యూలేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డిఐసి) ప్రకటన చేసింది. ఆ బ్యాంక్‌కు సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేసింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికాలో అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ ఎస్‌విబి కుప్పకూలడంతో ఆనాటి పరిస్థితులు ఎక్కడ పునరావృతం అవుతాయేనని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ బ్యాంక్ 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16వేల కోట్లు) నష్టాలు చవి చూసింది. ఎస్‌విబి ప్రధానంగా టెక్, స్టార్టప్ సంస్థలకు నిధులను సమకూర్చుతుంది. ఎస్‌విబిలో సంక్షోభం నెలకొనడం.. రెండు రోజుల్లోనే ఆ బ్యాంక్ సూచీ భారీగా పడిపోవడంతో అక్కడి రెగ్యూలేటరీ సంస్థ వేగంగా స్పందించింది. ఆ బ్యాంక్ మూత పడిన తర్వాత ఇందులోని 175 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) వినియోగదారుల డిపాజిట్లను ఎఫ్‌డిఐసి తన చేతుల్లోకి తీసుకుంది. ఖాతాదారులకు నష్టం జరగకుండా ఎఫ్‌డిఐసి కొత్తగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారాను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి ఖాతాదారులు తమ డిపాజిట్లపై ఉన్న బీమా సొమ్మును వెనక్కి తీసుకోవచ్చని తెలిపింది. మిగితా మొత్తం బ్యాంక్ విక్రయం తర్వాత అందిస్తామని వెల్లడించింది. ఎస్‌విబి సంక్షోభ పరిస్థితులు తెలిసిన ఆ బ్యాంక్ సిఇఒ బేకర్ 10 రోజుల ముందే తన షేర్లను అమ్మేసుకున్నారు. ఎస్‌విబి ఫైనాన్షియల్‌లో ఉన్న 3.6 బిలియన్ డాలర్ల విలువైన 12,451 షేర్లను ఫిబ్రవరి 27న విక్రయించారని ఆ గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎస్‌విబిని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమేనని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.