– నీరజ్ చోప్రాకు రెండో స్థానం
– జాకుబ్‌కు పసిడి పతకం
– డైమండ్ లీగ్ ఫైనల్స్
యూజీన్ (అమెరికా) : భారత గోల్డెన్ బారు, ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. యూజీన్‌లో శనివారం (భారత కాలమానం ప్రకారం అర్థ రాత్రి తర్వాత) జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో జావెలిన్ త్రో సూపర్‌స్టార్ ఇటీవల కాలంలో తొలిసారి అగ్రస్థానానికి దిగువన నిలిచాడు. మెన్స్ జావెలిన్ త్రోలో పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా.. ఈ సీజన్‌లోనే అత్యంత నిరాశజనక ప్రదర్శన చేశాడు!. 2022 డైమండ్ లీగ్ ఫైనల్లో 88.44 మీటర్ల త్రోతో కిరీటం దక్కించుకున్న నీరజ్ చోప్రా..ఈ ఏడాది రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. 83.80 మీటర్ల దూరమే ఈటను విసిరిన నీరజ్ చోప్రా.. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ వడ్లేచ్‌కు టైటిల్ కోల్పోయాడు. ఈటను 84.24 మీటర్ల దూరం విసిరిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్.. బంగారు బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై తొలిసారి పైచేయి సాధించాడు.
జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఫౌల్‌తో తొలి ప్రయత్నం అవకాశం చేజార్చుకున్నాడు. రెండో ప్రయత్నంలో ఫైనల్లో తన ఉత్తమ ప్రదర్శన చేశాడు. బల్లెం 83.80 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత వరుసగా 81.37 మీటర్లు, 80.74 మీటర్లు, 80.90 మీటర్లు ఈటను విసిరాడు. కానీ ఏ ప్రయత్నంలోనూ చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్‌ను అధిగమించలేకపోయాడు. ఇదే సమయంలో మూడో స్థానంలో నిలిచిన ఫిన్లాండ్ అథ్లెట్ ఒలీవర్ హెలాండర్ సైతం నీరజ్ చోప్రాపై ఒత్తిడి పెంచాడు. 83.74 మీటర్లతో మూడో స్థానంలో నిలిచిన ఒలీవర్.. నీరజ్ చోప్రాకు కేవలం ఆరు సెంటీమీటర్ల దూరంలోనే నిలిచాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. సెప్టెంబర్ 23 నుంచి ఆరంభం కానున్న ఆసియా క్రీడల్లో పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నాడు.