నేటి నుంచి మారనున్న సిమ్ కార్డ్ రూల్స్..!

నవతెలంగాణ- హైదరాబాద్: సిమ్ కార్డుల విక్రయం, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆగస్టు నెలలో రూపొందించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, పీఓఎస్ ఏజెంట్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్ దారుతో ఒప్పందంపై సంతకం చేయాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పీఓఎస్ ఏజెంట్లకు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అలాగే వారి లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేస్తారు. కొత్త సిమ్ కార్డు ని కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న నంబర్ లో కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేయడానికి వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. సిమ్ కార్డ్ హాల్డర్ యొక్క ఆధార్ కార్డ్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వివరాలు సేకరిస్తారు. ముఖ్యంగా డిస్ కనెక్ట్ అయిన 90 రోజుల తర్వాత మాత్రమే కొత్త కస్టమర్ కు మొబైల్ నెంబర్ ను కేటాయించాలి. అలాగే సిమ్ రీప్లేస్ మెంట్ కోసం సబ్ స్క్రైబర్ మొత్తం KYC ప్రక్రియను మళ్ళీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్త సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత 24 గంటల వరకు అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్, SMS సౌకర్యాలు అందుబాటులో ఉండవు. సిమ్ కార్డుల భారీ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఒక ID పై గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. అలాగే, వాణిజ్య, వ్యాపార, మరియు కార్బోనేట్ ఖాతాదారులకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇవ్వబడింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో విక్రయించిన సిమ్ కార్డును తమ ఉద్యోగాలకు కేటాయించేటప్పుడు, సంబంధిత సంస్థలు వారి KYC వివరాలను కచ్చితంగా సేకరించాలి.

Spread the love