పాపం..శాపం…

జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల్లో ఒంటికన్ను రాక్షసుడు… ‘ఛూ మంతర్‌కాళీ…’ అంటూ కమండంలోని నీటిని చల్లుతూ శపించగానే, హీరోనో లేక హీరోయినో బండరాయిలాగో, ఎలుగుబంటిలాగో మారిపోవ టాన్ని మనం చూసి ఉంటాం. ఇప్పుడు అదే తరహాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌… మీడియా సంస్థలకు శాపాల మీద శాపాలు పెడుతున్నారు. ‘మీ పాపాలు పండే రోజు దగ్గరకొచ్చింది, చూస్కోండి నా ప్రతాపం…’ అంటూ ఆయన మూడో నేత్రం తెరుస్తూ ఆగ్రహోదగ్రుడవుతున్నారు. ఇంతకీ పాల్‌ గారికి పత్రికలు, ఛానళ్ల మీద కోపం ఎందుకొచ్చిం దంటే… అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్‌ అయిన ఆయన్ను ఏ పేపర్‌గానీ, ఏ టీవీగానీ పట్టించు కోవటం లేదంట. ‘పనికిరాని వార్తలన్నీ వేస్తున్నారు.. కానీ నా వార్తలు మాత్రం ఒక్కసారి కూడా వేయటం లేదు… మీ అంతు తేలుస్తా… ఇప్పటికైనా ఒళ్లుదగ్గర పెట్టుకోండి, నేను మాట్లాడిన మాటలన్నింటినీ లైవ్‌లో ఇవ్వండి, పేపర్లరో రాయండి, లేకపోతే ఇబ్బందులు తప్పవు…’ అంటూ పాల్‌ సాబ్‌ హెచ్చరించారు. మీడియా సంస్థల యజమానులూ.. గమనిస్తున్నారా మరి….?
– కె.నరహరి

Spread the love