క్వార్టర్స్‌లో సింధు, సేన్‌

– కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్లు పి.వి సింధు, లక్ష్యసేన్‌ మళ్లీ గెలుపు బాట పట్టారు!. కెనడా ఓపెన్‌లో ఇటు సింధు, అటు లక్ష్య క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో నాల్గో సీడ్‌ పి.వి సింధు చెమట పట్టకుండా ముందంజ వేసింది. ప్రీ క్వార్టర్స్‌ ప్రత్యర్థి నట్సుకి (జపాన్‌) ఫిట్‌నెస్‌ సమస్యలతో వాకోవర్‌ ఇచ్చింది. దీంతో సింధు నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో చైనా షట్లర్‌ ఫాంగ్‌ జితో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 21-15, 21-11తో బ్రెజిల్‌ షట్లర్‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. 31 నిమిషాల్లోనే లాంఛనం ముగించిన లక్ష్యసేన్‌ రెండో గేమ్‌లో ఏకంగా వరుసగా తొమ్మిది పాయింట్లతో చెలరేగాడు. నేడు క్వార్టర్స్‌లో బెల్జియం ఆటగాడు, క్వాలిఫయర్‌ జులియన్‌తో లక్ష్యసేన్‌ పోటీపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో విష్ణు వర్థన్‌ గౌడ్‌, కృష్ణ ప్రసాద్‌ జోడీ 9-21, 11-21తో ఇండోనేషియా జోడీ చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలైంది.

Spread the love