వేలం కత్తికి వేలాడుతున్న ‘సింగరేణి’!

వేలం కత్తికి వేలాడుతున్న 'సింగరేణి'!తెలంగాణ కల్పతరువు..మన సింగరేణి. సిరులనిచ్చే బొగ్గు గనులు..మన ప్రాంత వనరులు. ఎంతోమందికి అన్నం పెట్టి, ఉపాధి చూపిన నల్ల బంగారం నేల నేడు కేంద్రం ప్రయి’వేటు’కు విలవిల్లాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రయివేటీకరణ యత్నాలను తిప్పికొట్టి నిలబడిన సింగరేణి ఇప్పుడు గనులు, నిల్వలు బ్లాక్‌ల వారీగా వేలం కత్తికి వేలాడుతోంది. నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసి భంగపడిన మోడీ సర్కార్‌ నేడు బొగ్గుగనులపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోంది. లాభాల బాటలో నడుస్తున్న సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి అస్థిరపరిచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ గనులను ప్రయివేటుపరం చేసే కుట్రకు తెరదీసింది. ఇది తెలంగాణకు అతిపెద్ద పెనుముప్పు. అందుకే సిఐటియు వంటి కార్మిక సంఘం సింగరేణికి దన్నుగా నిల బడి పోరాడుతున్నది. సింగరేణిని పరిరక్షించాలని, బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని, కార్మికుల హక్కుల్ని, ఉపాధిని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర ప్రారంభించింది.
సింగరేణి అంటే ఒక సంస్థనే కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగింది. దీంతో పాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నది. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పిఎల్‌ఎఫ్‌ను కలిగి ఉన్నది. కేవలం సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్రతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా చేయడంతో దేశం విద్యుత్తు కాంతులతో విరజిమ్ముతోంది. దీంతోపాటు సింగరేణి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తూ సింగరేణి ప్రగతి ప్రస్థానంలో దూసుకెళ్తున్నది. దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థ ఇవ్వని విధంగా లాభాల్లో 29 శాతం వాటను కార్మికులకు ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి. ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. సింగరేణి యాజమాన్యం, కార్మికవర్గం కషితో ఇంతకాలం కార్మికులకు లాభాల్లో వాటాలు అనేది పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. ఇక సంస్థను ప్రయివేటుపరం చేస్తే, ఇక నుంచి నష్టాల మూటలు అనేవి ప్రధాన శీర్షికలు అవుతాయి. ప్రగతి పథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి,నష్ట పూరిత పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రయివేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోంది. గుజరాత్‌కు మాత్రం అడిగిన వెంటనే కేంద్రం లిగ్నైట్‌ గనులను ఎలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ సంస్ధకు కేటాయించింది. కానీ తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వదు? దేశమంతా ఒక్కటే అయినప్పుడు గుజరాత్‌కో విధానం, తెలంగాగాణకో విధానం ఉంటుందా?
దూకుడుగా ప్రయివేటీకరణ!
కోల్‌మైన్‌ అంటే బొగ్గు గనులే కాదు..యువతకు ఉపాధి సృష్టించి గోల్‌మైన్‌. అలాంటి సంస్థను అస్థిరపరిచి ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం తెగబడింది. మొదటి కాప్టివ్‌ మైనింగ్‌ పేరుతో కోల్‌ ఇండియా, సింగరేణి నుంచి బొగ్గు కొనకుండా తానే ఉత్పత్తి చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత నెమ్మదిగా సాధారణ బొగ్గు తవ్వకాల్లో కూడా ప్రయివేట్‌ సంస్థలకు చొరబాటుకు దారి చూపి ఆపై వెసులుబాటు కల్పించింది.లీజ్‌ ఒప్పంద విధానాల్లో సులభతరంగా మార్పులు చేసింది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా దూకుడుగా ప్రయివేటీకరణ విధానాలను అమలు చేస్తోంది.అందులో భాగంగా సింగరేణిలో 2021లో మరో దుర్మార్గ చట్టాన్ని తీసుకొచ్చింది.బొగ్గు వేలం పాటలో నెగ్గిన వారికి ఎలాంటి కండీషన్లు లేకుండా ఆ చట్టం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.కార్మికుల భద్రత, సంక్షేమం,పర్యావరణ సంరక్షణ మొదలైన సమస్య ఏమైనప్పటికీ ఇవేవీ వారికి ముఖ్యం కాదు.వారికి కేవలం లాభాలు దండుకోవటమే లక్ష్యం.ప్రభుత్వమే పూనుకొని సింగరేణి బొగ్గు తవ్వకాలు జరిపితే ఉత్పత్తి కారుచౌకగా లభిస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి కూడా ధారాళంగా, చౌకగా వస్తుంది. దానితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు ఆదాయం మెండుగా సమకూరుతుంది. కార్మికుల, ప్రజల ప్రాధాన్యతను పక్కన పెట్టి బొగ్గుబ్లాకును వేలం వేయడమనేది దుర్మార్గమైన చర్య. ప్రయివేటు వ్యాపార ప్రయోజనాల కోసం,బడా కార్పొరేట్ల లాభాల కోసం లక్షలాది కార్మికులు, వారి కుటుంబాల పొట్టకొట్టడం దారుణం.
యుపిఎ ప్రభుత్వ కాలంలో కోల్‌ ఇండియా పది శాతం వాటాలు అమ్మితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మరో 29 శాతం వాటాలను అమ్మింది. క్రమంగా వాటికున్న హక్కులను నిర్వీర్యం చేయడం, తెలంగాణ వరప్రదాయిని సింగరేణిని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం దాని లక్ష్యంగా ఉంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా 2003లో సింగరేణి 15 రోజులపాటు సమ్మె చేసింది.ఆ తర్వాత అనేక పోరాటాలు వెల్లువెత్తాయి. అయినా పాలకులు తమ విధానాల్ని మార్చుకోలేదు. పైగా మోడీ ప్రభుత్వం నగరీకరణ పేరుతో, ప్రయివేటువాళ్లకు విపరీత రాయితీ లిచ్చింది. బొగ్గు దిగుమ తుల మీద సుంకం రద్దు చేసింది. వీటితోపాటు దేశంలో బొగ్గు వినియోగించే సంస్థలన్నీ పది శాతం దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కూడా విధించింది.ఆ విధంగా దిగుమతుల రూపంలో బొగ్గు కొనేందుకు అవకాశం కల్పించింది. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసమే కేంద్రం చూస్తోందన్నది దీన్నిబట్టి తెలుస్తోంది. ఉదాహరణకు టన్ను బొగ్గు 3,500 రూపాయల నుంచి 4వేల రూపాయలకిచ్చే సింగరేణిని కాదని పొరుగు రాష్ట్రమైన ఏపీ అనివార్యంగా గతంలో టన్నుకు 18వేల రూపాయల చొప్పున 7 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. ఇలా చేయడం ద్వారా ఛార్జీలు పెరిగి ప్రభుత్వ ఖజానా మీద అధిక భారం పడింది. ఇది అంతిమంగా ప్రజలపై ప్రభావం చూపుతుంది. తెలంగాణలోనైతే జెన్కో, ఎన్టీపీసీకి గత ప్రభుత్వం రూ. 30వేల కోట్ల బకాయిపడింది. అయినా సింగరేణి లాభాల్లోనే ఉందంటే అధిక బొగ్గు ఉత్పత్తి, కార్మికుల శ్రమయే కారణం.
ప్రమాదంలో పారిశ్రామిక రంగం
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సింగరేణి సంస్థ సొంత ఖర్చులతో అనేక ప్రాంతాల్లో సర్వే చేసి బొగ్గు బ్లాక్‌ లను గుర్తించింది. ఆపై బొగ్గు ఉత్పత్తిని కూడా చేపట్టింది. శ్రావణపల్లిలో కూడా ఆ రకంగానే బొగ్గు తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. కానీ వేలం పాటల ద్వారా దక్కించుకోవాలని కేంద్రం నిర్దేశించింది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఇదే బాటలో నడిచి వేలం పాట ద్వారానే ప్రయివేటువారికి వత్తాసు పలికింది. ప్రస్తుత ప్రభుత్వమేమో సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ సరైన ప్రణాళికతో కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. దీనిపై అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బొగ్గు గనులను రక్షించేందుకు కార్యచరణ చేపడితే ప్రయోజనకరం. ఒక్కసారి గనులు ప్రయివేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిన తర్వాత గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాలకు ఉద్వాసన పలికే అవకాశాలే మెండు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు,లాభాల్లో వాటా వంటి అన్ని సౌకర్యాలూ దూరమవుతాయి.
అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోయే ప్రమాదమూ లేకపోలేదు. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలకు బొగ్గు అందుతోంది. ఒకవేళ ఈ సంస్థ ప్రయివేటీకరణ అయితే ఆయా పరిశ్రమలకు బొగ్గు సరఫరా అందడం ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కేంద్రం సింగరేణిలోని కేవలం బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదు, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తోంది.ఈ వేలం వెర్రి ఆలోచనలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలి. లేదంటే ఎన్నో విరోచిత పోరాటాలకు కేరాఫ్‌గా నిలిచిన సింగరేణి కార్మికవర్గం మరోసారి ఉద్యమ ఉక్కు పిడికిలి బిగించేందుకు సిద్ధమవ్వాలి.
నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140

Spread the love