కార్పొరేట్ల కోసమే సింగరేణి ప్రయివేటీకరణ

Singareni privatization is for corporates– మోడీ ప్రభుత్వ విధానాలతో సామాన్యులకు తీరని నష్టం : బహిరంగసభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌
– నియంత్రించకుంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ తరహాలోనే కోల్‌బ్లాక్‌ల దుస్థితి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
– మోడీ ప్రభుత్వ విధానాలతో సామాన్యులకు తీరని నష్టం : బహిరంగసభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌
– కొత్తగూడెంలో ముగిసిన సింగరేణి పరిరక్షణ యాత్ర
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కొత్తగూడెం
కార్పొరేట్ల కోసమే లాభాల్లో ఉన్న సింగరేణిని మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయరాఘవన్‌ అన్నారు. సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో గనుల వేలం పేరుతో మొదలైన ఈ చర్యలను నియంత్రించ కపోతే బీఎస్‌ఎన్‌ఎల్‌ తరహా లోనే కోల్‌బ్లాక్‌ల దుస్థితి తయారవుతుందని హెచ్చరించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గతనెల జులై 29న బెల్లంపల్లిలో చేపట్టిన ‘సింగరేణి పరిరక్షణ యాత్ర’ సోమవారం కొత్తగూడెంలో ముగిసింది. ఈ సందర్భంగా కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ ఆవరణలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో విజయరాఘవన్‌ మాట్లాడారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని ఐదు నుంచి ఆరు జిల్లాల ప్రజల జీవితాలు, హక్కులను ముందుకు తీసుకెళ్లేందుకు సీపీఐ(ఎం), ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఈ పరిరక్షణ యాత్రను చేపట్టారని తెలిపారు. ‘బీజేపీ పాలనలో ప్రజలు అనేక సామాజిక సమస్యలతో సతమతం అవుతున్నారు. భూమితో పాటు తినేందుకు తిండి…ఉండేందుకు ఇల్లులేని స్థితి నెలకొంది. బీజేపీ, నరేంద్రమోడీ పాలనలో కేవలం ధనవంతులు, కార్పొరేట్లు, అధానీలు, అంబానీలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు’ అని అన్నారు. ప్రపంచంలోనే నిరుద్యోగితలో భారతదేశం ప్రథమస్థానంలో ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం 40శాతం పెరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవనస్థితిగతులు దిగజారయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించి తక్కువ సీట్లు ఇచ్చారని, కొన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చి అధికారం ఇవ్వడానికి సహకరించాయని తెలిపారు. వారికి బహుమతిగా సింగరేణి బొగ్గు బ్లాకులను కట్టబెడుతు న్నారని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ఎందుకు ప్రయి వేటీకరణ చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సంస్థను ప్రయివేటీకరిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న బొగ్గు బ్లాక్‌లను కాకుండా భవిష్యత్తు బ్లాక్‌లను మాత్రమే ప్రయివేటీకరిస్తు న్నామని చెబుతున్నారని వివరించారు. ప్రస్తుతం ఉన్న గనుల్లో బొగ్గు అయిపోతే ఏ బొగ్గు బ్లాక్‌ల మీద ప్రజలు ఆధారపడాలని ప్రశ్నించారు. ప్రయివేటుకు అప్పగించిన కొత్త బొగ్గు బ్లాక్‌ల మీద ఆధారపడాల్సి వస్తుందన్నారు. గనుల మీద ఆధారపడిన పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఉపాధి, ఆదాయ వనరులు చూపించకుండా ప్రయివేటుకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని విజయరాఘవన్‌ మండిపడ్డారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ల విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు. టెలిఫోన్‌లను ప్రయివేటీకరించట్లేదు… భవిష్యత్తులో వచ్చే మొబైల్స్‌ (సెల్‌ఫోన్‌)ను మాత్రమే ప్రయివేటీకరిస్తున్నామని నాటి ప్రభుత్వాలు చెప్పాయన్నారు. కాలక్రమేణా ల్యాండ్‌ ఫోన్‌లు అనేవి లేకుండా పోయాయని, ఇప్పుడు మొత్తం సెల్‌ఫోన్‌లు మాత్రమే ఉన్నాయన్నారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థల్లో 96శాతం ప్రయివేటులోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కోల్‌బ్లాక్‌ల విషయంలోనూ అదే జరగబోతుందన్నారు. ఈ ప్రయివేటీకరణంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ప్రయివేటీకరణతో పేదలు అదనంగా వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ల కోసమే ఇలాంటి చర్యలన్నారు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు పెరుగుతుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును 10శాతమైనా వాడాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రయివేటుకు కట్టబెట్టడం కోసమే ఇలా చేయడం అన్నారు. క్రమేణా గనులపై ప్రభుత్వ నియంత్రణ కోల్పోయి కార్పొరేట్ల ఆధిపత్యం ఎక్కువవుతుందన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీలు, కార్మికవర్గాలు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ప్రయివేటీకరణను కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకించాలి
రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సైతం ప్రాధేయపడు తున్నానని, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిలబడాలని విజయరాఘవన్‌ కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించే దమ్ము ఎర్రజెండాకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అందుకే సింగరేణి పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) నికరంగా పోరాడుతోందని, దేశ భక్తిని చాటుకుందన్నారు. సింగరేణి లాభాల్లో నడుస్తుందని అందుకే కార్పొరేట్‌ కళ్ళు దానిపై పడ్డాయన్నారు. కార్పొరేట్ల లాభాల కోసమే ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ప్రయివేటీకణ చేయమని చెబుతూనే బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పెడుతుండటాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. పోరాటాలు చేసి సింగరేణిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
సింగరేణి పరిరక్షణ తెలంగాణ ప్రజల కర్తవ్యం….. : భూపాల్‌
సింగరేణి పరిరక్షణ పూర్తిగా తెలంగాణ ప్రజల కర్తవ్యం. తెలంగాణ అభివృద్ది, యువతకు ఉపాధి, తెలంగాణ అభివృద్ది కావాలంటే సింగరేణి సంస్థ బతికి బట్టకట్టాలని సీపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌ అన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. సింగరేణి అన్వేషించిన బాగ్గు బ్లాకులను ప్రయివేటు పరంచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 9 రోజుల పాటు సాగిన బస్సుయాత్రను ఆదరించిన కార్మిక లోకానికి కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యను తీవ్రంగా పరిగణించాలి… : ఆశయ్య
వంద ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి చరిత్రను కనుమరుగు చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని, బొగ్గు బ్లాకులు ప్రయివేటు పరం చేసే సమస్యను తీవ్రంగా పరిగణించని పక్షంలో పెద్దఎత్తున ప్రమాదం ఉందని సీపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య అన్నారు. తెలంగాణలో సింగరేణి ఉన్నందుకే తెలంగాణలో యువతకు ఉపాధి ఉందని చెప్పారు. బీజేపి మంత్రులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు కొంగు బంగారం అయిన సింగరేణిని ప్రయివేటుపరం చేసేందుకు బొగ్గుబ్లాకులు వేలం వేస్తున్నారని, దీనికి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం వత్తాసు పలుకున్నతీరును తీవ్రంగా పరిగణించాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని డిమాండ్‌ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మరోసారి సకల జనుల సమ్మెను చేయాల్సిన పరిస్థితి తీసుకు రావద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, మందా నరసింహరావు, జగదీష్‌, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్‌,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం.జ్యోతి, లిక్కీ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి పరిరక్షణ ఉద్యమం కొనసాగిస్తాం -ఎస్‌.వీరయ్య
తెలంగాణలో సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య స్పష్టం చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని కోరారు. బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి ప్రయివేటీకరణ అయితే విద్యుత్‌ రేట్లు పెరిగిపోతాయిని, ఇంట్లో కరెంటు బుగ్గలు వెలగవన్నారు. ఉచిత విద్యుత్‌ లేకుండా పోతుందని, ఇది సింగరేణి కుటుంబాలకు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలకు కూడా పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రజల సంపదను భావితరాలకు అందించడం కోసం భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
ప్రకృతి సంపదనను కాపాడు కోవాలి: పోతినేని సుదర్శన్‌రావు
ప్రకృతి సంపదను మనం కాపాడుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొదటి సంతకం పెట్టి ప్రయివేటుకు బొగ్గు బ్లాక్‌లను కట్టబెడుతున్నారన్నారు. అప్పటి ప్రభుత్వాలు మొదటి సంతకం ప్రజల ప్రయోజనం కోసం చేస్తే, బిజేపి మంత్రి కిషన్‌ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను ప్రయివేటు వారికి కట్టబెట్టేందుకు, ప్రజలకు నష్టం కలిగించేందుకు సంతకం చేశారని చెప్పారు. ప్రకృతి ప్రజలకే చెందాలని ఉన్నప్పటికీ బిజేపి మాత్రం ప్రయివేటు వారికి కట్టబెట్టడం అన్యాయమన్నారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజనుల సంపదను ప్రయివేటుకు కట్టబెడుతుంటే సహించేది లేదన్నారు. ఇప్పటికే ఇల్లందు పట్టణం సింగరేణి బొగ్గు బ్లాకులు మూసి వేశారు. ఇదే విధంగా మణుగూరు, కొత్తగూడెం పట్టణాలు అంతరించి పోతే ఇక్కడి ప్రజలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో యువతకు సింగరేణిలో ఉద్యోగాలు లేకుండా పోతాయన్నారు. ఇది అందరికి సంబంధించిన సమస్య అందుకే అందరూ కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు.

Spread the love