– కేసీఆర్ కు కృతజ్ఞతలు
– కార్మికులు, అధికారులకు అభినందనలు
నవ తెలంగాణ – సింగరేణి ప్రతినిధి
సింగరేణి సంస్థ 2022 – 23 సంవత్సరానికి గాను ₹2222 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్తు అమ్మకాల ద్వారా గడిచిన సంవత్సరం ₹3365 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించినట్లు ఆయన వెల్లడించారు. 28,650 కోట్ల రూపాయలను బొగ్గును అమ్మకం ద్వారా, 4415 కోట్ల రూపాయలను విద్యుత్ అమ్మకం ద్వారా సాధించినట్లు పేర్కొన్నారు. నికర లాభం ₹3074 కోట్ల రూపాయలు సాధించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇతర రకాల పన్నులను చెల్లించిన అనంతరం ₹2222 కోట్ల రూపాయల అత్యధిక లాభాలను సాధించినట్లు పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తన 134 సంవత్సరాల చరిత్రలో భారీ లాభాలను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాధించిందని చైర్మన్ శ్రీధర్ కొనియాడారు.
సింగరేణి సంస్థ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటికన్నా అత్యధిక లాభాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిందని ప్రకటించారు.
2021- 22 సంవత్సరంలో ₹ 1,227 కోట్ల రూపాయల లాభాలను సంస్థ సాధించిందని, గత సంవత్సరంతో పోల్చుకుంటే 470 శాతం పురోభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం 67.14 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు, అధికారులు అంకితభావంతో పనిచేయడం వలన లాభాలు సాధించుకోగలిగామని సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా కార్మికులను, ,అధికారులను, కార్మిక నాయకులను చైర్మన్ ఆభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సింగరేణి ఎడల అత్యంత ప్రేమాభిమానాలను, ప్రోత్సాహాన్ని ఇవ్వడం వలన ఈ అభివృద్ధి సాధించుకోగలిగామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రేమాభిమానాలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే 2023 – 24 సంవత్సరానికి 4000 కోట్ల రూపాయల లాభార్జన సాధ్యమేనని ప్రకటించారు. కోల్ ఇండియా సంస్థ నాలుగో స్థానానికి మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ మనుగడ, అభివృద్ధికి, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.