– నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆవేదన
– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-భువనగిరి అర్బన్
నాసిరకం భోజనం మేము తినలేమంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేశారు. పలుమార్లు వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆదివారం రాత్రి భోజనం చేయకుండా నిరసన తెలిపారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వంట గిన్నెలను తీసుకెళ్లి కలెక్టరేట్ ముందు పెట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు మాట్లాడారు. నాణ్యతలేని భోజనం పెడుతున్నారని, హాస్టల్ విద్యార్థుల పట్ల వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హాస్టల్ బాత్రూముల్లో నల్లాలు, స్నానం చేయడానికి బకెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ రూమ్‌లలో ఫ్యాన్లు పనిచేయడం లేదన్నారు. ఈ విషయాలపై అనేకమార్లు హాస్టల్ వార్డెన్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సమస్యలను పరిష్కరించాలని కోరిన విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల సంఖ్య కంటే తక్కువగా చికెన్, గుండ్లు పెడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి, డీఆర్డీఓ ఎంఏ కృష్ణన్ స్పందించి కలెక్టరేట్ బయటకొచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు వేముల నాగరాజు, ఈర్ల రాహుల్, నాయకులు ఎండి నేహాల్, భవాని శంకర్, హాస్టల్ విద్యార్థులు బాలకృష్ణ, ప్రశాంత్, మధు, పవన్, నవీన్, ప్రశాంత్, సిద్దు, వెంకట్ పాల్గొన్నారు.