నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా కప్ ఫైనల్ హీరో మహ్మద్ సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ప్రైజ్‌మనీగా 5 వేల అమెరికన్ డాలర్లు.. భారతీయ కరెన్సీలో రూ. 4 లక్షలు అందుకున్నాడు. అనంతరం తన బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడిన సిరాజ్ సంచలన నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ప్రైజ్‌మనీగా అందుకున్న రూ. 4 లక్షలు మొత్తాన్ని ప్రేమదాస స్టేడియం సిబ్బందికి ఇస్తున్నట్టు చెప్పాడు. దాంతో, ఒక్కసారిగా స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ‘గ్రౌండ్ మెన్ లేకుంటే ఈ టోర్నీ సాధ్యం కాకపోయేది. వాళ్ల కష్టానికి గుర్తింపుగా నా ప్రైజ్‌మనీని ఇచ్చేస్తున్నా’ అని సిరాజ్ అన్నాడు. ఆసియా కప్‌లో వరుణుడు కీలకమైన సూపర్ 4 మ్యాచ్‌లకు పలుమార్లు అంతరాయం కలిగించాడు. అయితే.. వాన తగ్గగానే గ్రౌండ్ సిబ్బంది శరవేగంగా పిచ్‌ను సిద్ధం చేశారు. హాలోజెన్ లైట్స్ సైతం ఉపయోగించి మ్యాచ్ కొనసాగేలా చేశారు. దాంతో, సిరాజ్ వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీని వాళ్లకు ఇచ్చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం రూ.40 లక్షలు గ్రౌండ్‌మెన్‌కు ఇస్తున్నట్టు ప్రకటించాయి.