పాత కక్షలతో అక్క పై దాడి.. చెల్లెలు అరెస్టు

నవతెలంగాణ-  ఆర్మూర్
పాత కక్షలను మనసులో పెట్టుకొని సొంత అక్కపై దాడి చేసి గాయపరిచన చెల్లెలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు  బుధవారం ఆర్మూర్ పోలీసులు తెలిపారు. వివరాలోకి వెళ్తే… పెర్కిట్ లో నివాసం ఉండే అక్క శ్రావణి, ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా సమీపంలో నివాసం ఉండే ఖాందేష్ సౌమ్యలు అక్కా, చెల్లెళ్ళు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు అక్క శ్రావణి వద్ద చెల్లెలు సౌమ్య తీసుకుంటూ వచ్చింది. హుస్నాబాద్ కాలనీలో కూలిపోయిన పాత ఇంటిని పునఃనిర్కాణం చేపట్టడానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం చేయాలని అక్క శ్రావణి, బావ విటోభలను కోరింది. అంత డబ్బు ఇవ్వడానికి వారు నిరాకరించారు. మళ్ళీ మళ్ళీ డబ్బులు అడగడంతో ఇంకోసారి డబ్బుల విషయంలో తమవద్దకు రావొద్దని తేల్చి చెప్పారు. అప్పటినుండి అక్క, బావలపై కోపం పెంచుకుంది. మూడేళ్ళ నుంచి ఇరు కుటుంబాల మధ్య రాకపోకలుగాని, మాటలుగాని లేవు. మేనత్త కొడుకు నిశ్చితార్థం ఉండటంతో సౌమ్య బాలాజీ ఫంక్షన్ హాలుకు  వచ్చింది. అదే ఫంక్షన్ కు ఆమె అక్క, బావలు రావడాన్ని గమనించి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో బావపై ఖాందేష్ సౌమ్య దాడి చేయబోగ అక్క అడ్డు పడింది. అడ్డు వచ్చిన ఆమెపై దాడి చేసి బలంగా నెట్టివేయడంతో  తలకు బలమైన దెబ్బలు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖాందేష్ సౌమ్యపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love