నవతెలంగాణ – చండూరు
సీపీఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం యావత్ భారత్ రాజకీయాలకు తీరని లోటని, వామపక్ష ఉద్యమాలకు ఒక దిక్సూచి లాంటి గొప్ప నాయకుని కోల్పోయామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం అంతంపేట గ్రామంలో శాఖ మహాసభలకు ప్రారంభ సూచికగా సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. అంతపేట గ్రామంలోని మల్లప్ప నగర్ లో శాఖ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయాలను గాడిలో పెట్టడంలో వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలకు దిశ నిర్దేశం చేయడంలో సీతారాం ఏచూరి పాత్ర కీలకమన్నారు. అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ కాలంలోప్రభుత్వానికి రాజకీయ విధానం పట్ల అవగాహన కల్పించిన గొప్ప మేధావి అన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందుపేద, మధ్యతరగతిప్రజల జీవన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వానికి కామన్ మినిమమ్ ప్రోగ్రాం లో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉపయోగపడాలని, రాజకీయ తీర్మానాన్ని తీసుకురావడంలో, సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో,గిరిజన హక్కుల చట్టాలను తీసుకురావడంలో ఏచూరి పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. అనేకమంది నాయకులు ఏచూరి నాయకత్వంలో ప్రజా ఉద్యమాలు నడిపారని నేటి తరం నాయకులకు ఏచూరి జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. ప్రపంచ దేశాలకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేవారని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లోఏచూరి లాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం సీపీఐ(ఎం) పార్టీకి తీరనిలోటని, ఆయన ఆశయాలు సాధించడం కోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గట్టుప్పల్ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, మండల కమిటీ సభ్యులు కకునూరి నాగేష్, తెలుసూరి సైదులు, దాసరి శ్రీశైలం, గూడెపు మల్లేశం, ముసుకు బుచ్చిరెడ్డి,చంద్రయ్య, పల్లపు శ్రీను, అంతంపేట నూతన గ్రామ శాఖ కార్యదర్శి రాచమల్ల వెంకట్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.