రేపు ఉక్కు రక్షణ యాత్ర ముగింపు.. సీతారాం ఏచూరి హాజరు

నవతెలంగాణ – అమరావతి: విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు రక్షణ యాత్ర గురువారం ముగియనుంది. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీలు ప్లాంటు మెయిన్‌గేటు (కూర్మన్నపాలెం) వద్ద భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ సభకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు హాజరవుతారని తెలిపింది. సీసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సెప్టెంబరు 20న విశాఖపట్నంలోని జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం నాయకత్వంలో 52 మంది కార్యకర్తలతో బైకుయాత్ర ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లో 12 రోజులపాటు సుమారు 1500 కిలోమీటర్లు సాగింది. 150 సెంటర్లలో సభలు నిర్వహించగా, 30 వేలమంది ప్రజలు హాజరయ్యారు. బైకుయాత్రకు సంఘీభావంగా ఎక్కడికక్కడ ప్రజలు పెద్దయెత్తున బైకులతో యాత్రలో పాల్గన్నారు. మొత్తంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. బైకుయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర కమిటీ తెలిపింది.

Spread the love