విఫలమైన బీజేపీ విభజన వాదం : సీతారాం ఏచూరి

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. సీట్ల విషయంలో అతి స్వల్పంగా మెరుగుపడినా తీవ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నామని చెప్పారు. లెఫ్ట్‌ తరఫున ఎన్నో ఆందోళనలను నిర్వహించినా ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకపోవడం నిరాశకు గురి చేసిందని వివరించారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేరళలో లెఫ్ట్‌ ఓట్లు తగ్గలేదని, కాంగ్రెస్‌ కూటమి ఓట్లను చీల్చడంద్వారా బీజేపీ ఖాతా తెరిచిందని అభిప్రాయపడ్డారు. 17వ లోక్‌సభలో 5 సీట్లు ఉండేవని, వాటిని ఈ ఎన్నికల్లో 8కి పెంచుకున్నామని తెలిపారు. అయినా సంతృప్తిగా లేమని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ప్రజల జీవన ప్రమాణాలు, నీట్‌ వంటి వాటిపై ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందని చెప్పారు. పార్లమెంటు లోపలా, బయటా వాటిపై ఆందోళనలు చేస్తామని తెలిపారు. బీజేపీ విభజనవాదం విఫలమైందని, హిందుత్వ కూడా ఫలితాలివ్వలేదని, అందుకు అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో ఆ పార్టీ ఓడిపోవడమే నిదర్శనమని ఏచూరి అభిప్రాయపడ్డారు.

Spread the love