నవతెలంగాణ-నసురుల్లాబాద్ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,పిహెచ్ సి కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ లు నసురుల్లాబాద్ గ్రామంలో స్థల పరిశీలన చేశారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల ప్రజల సౌకర్యార్థం కోటి 40 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం కోసం స్థలం పరిశీలించడం జరిగింది. బాన్సువాడ బోధన్ నిజాంబాద్ వెళ్లే రహదారి పక్కన ఉన్న నసురుల్లాబాద్ మండల ప్రజలు ఆసుపత్రి కోసం వివిధ పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని అందుకు దాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశామని డి ఎం హెచ్ ఓ డాక్టర్ లక్ష్మణ్ సింగ్, పెర్క శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలం ఎంపిక కాగానే పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఫోరం కన్వీనర్ కంది మల్లేష్, లక్ష్మీనారాయణ గౌడ్ మైష గౌడ్, సాయిలు, ప్రతాప్ సింగ్, ఎంపీఓ రాము, ఆరోగ్యశాఖ అధికారులు రవీందర్, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.