అన్యాయాన్ని నిల‌దీసిన సివంగి

అన్యాయాన్ని నిల‌దీసిన సివంగివీరనారి అయిలమ్మ.. తెలంగాణలో భూస్వాములు, పటేల్‌, పట్వారీలకు ధీటుగా నిలబడింది. ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని వినిపించింది. దుర్భర బతుకులకు చరమగీతం పాడేందుకు నడుంబిగించింది. దొరలను గడీల నుంచి ఉరికించిన వీరవనిత. తెలంగాన పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు. ఈ రోజు ఆమె వర్థంతి సందర్భంగా ఆ స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో…
రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు అయిలమ్మ. చిట్యాల నరసయ్యను వివాహం చేసుకుని పాలకుర్తి గ్రామానికి కోడలుగా వచ్చారు. సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగం, సోమ నర్సమ్మ, లచ్చి నర్సయ్య, ఉప్పలయ్య అనే ఆరు బిడ్డలు వీరికి. అతి పేద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టిన అయిలమ్మ తమ కులవృత్తి అయిన రజక పని చేసుకుంటూ ఉపాధి పొందేవారు. రజక వృత్తిదారులుతో కూడా ఆనాటి దొరలు వెట్టిచాకిరి చేయించుకునేవారు. ఆ వృత్తితో తగిన ఆదాయమే కాక గౌరవం కూడా లేకపోవడంతో అయిలమ్మ కల్లు వ్యాపారం మొదలు పెట్టారు.
గౌరవంగా బతకాలన్న తపనతో…
కోలుకొండ నుంచి పాలకుర్తి వరకు ఆమె 10 కిలోమీటర్లు కల్లుకుండలు కావడిగా మోసుకొని తెచ్చేవారు. నరసయ్య, సోమయ్యలు ఎడ్లబండిపై తోలు తిత్తితో కలుసరఫరా చేసేవారు. కొంత కాలానికి ఆర్థిక ఇబ్బందులు తొలిగి పోయాయి. ఆ ఆదాయంతో సుమారు 200 గొర్రెలు, మేకలు, నాలుగు నాగండ్ల ఎడ్లు, పాలిచ్చే బర్రెలు కొనుగోలు చేశారు. కల్లు వ్యాపారం అభివృద్ధి చెందడంతో భూస్వాములు ఆటంకాలు సృష్టించారు. గౌరవంగా బతకాలన్న తపన ఉన్న అయిలమ్మ దృష్టి అప్పుడు వ్యవసాయం వైపు మళ్ళింది. పెద్ద కొడుకు సోమయ్య, నడిపి కొడుకు లచ్చయ్య ఎదగడంతో మల్లంపెల్లికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద నాలుగు ఎకరాల పొలం, 35 ఎకరాల చెలుక కౌలుకు తీసుకున్నారు. భర్త నరసయ్య, ఇద్దరు కొడుకుల సహకారంతో వ్యవసాయం ప్రారంభించారు.
ప్రజలతో మమేకమై
కుటుంబమంతా వ్యవసాయ పనుల్లో మునిగి వెట్టి పనులు, కులవృత్తి మానేశారు. వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మరో ఇద్దరినీ వ్యవసాయ జీతగాల్లుగా పెట్టుకున్నారు. అయిలమ్మ శ్రమనే పెట్టుబడిగా పెట్టింది. కుటుంబ వ్యవహారాల్లో అన్నీ తానై చక్కదిద్దుకునేవారు. దీంతో కొత్త జీవితం ప్రారంభమైంది. వ్యవసాయ పనులతో ఆర్థికంగా ఎదగడంతో పాటు అయిలమ్మ ప్రజలతో మమేకమై కులవృత్తిదారులకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. ఇది భూస్వాములకు, పెత్తందారులకు రుచించలేదు. పాలకుర్తి పోలీస్‌ పటేల్‌ వీరమనేని శేషగిరిరావు, విస్నూరు దొరకు ప్రధాన అనుచరుల్లో ఒకడు. పాలకుర్తిని శాసిస్తూ తన ఆధిపత్యాన్ని దేశముఖ్‌ అండతో నిలబెట్టుకుంటున్నాడు. ప్రజలను పీడించడం, వెట్టిచాకిరి చేయించుకోవడం ఇతనికి నిత్య కృత్యం. అయిలమ్మ కుటుంబాన్ని కూడా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అయిలమ్మతో పాటు పోలీస్‌ పటేల్‌ చేత పీడించబడిన జీడి నరసయ్య, జీడి బాలయ్య, వీరమనేని రామచంద్రయ్య, మామిండ్ల కొండయ్య, శేరు సోమనరసయ్యల నాయకత్వంలో పాలకుర్తి గ్రామంలో ఆరుట్ల రాంచంద్రారెడ్డి సమక్షంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు పాలకుర్తి నుండి 15 మంది వెళ్లారు. ఆ మహాసభ నుండి స్ఫూర్తి పొందిన అయిలమ్మ దంపతులు సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దాంతో 15 మందితో ప్రారంభమైన సంఘం అతి తక్కువ కాలంలోనే 200 మందికి చేరింది.
ప్రజల్లో విశ్వాసం
ప్రజా చైతన్యవేదికకు వచ్చే ఆరుట్ల రామచంద్రారెడ్డిని విస్నూరు దొర గూండాలు హత్య చేస్తారనే వార్త తెలియడంతో అందరూ అప్రమత్తమయ్యారు. సభలో కళాకారులు పాటలు పడుతున్నారు. కమ్మరి బ్రహ్మయ్య తబలా వాయిస్తున్నాడు. వావిలాల గ్రామం నుండి ఆరుట్ల రామచంద్రారెడ్డిని ఎడ్ల బండిలో సభా వేదిక మీదికి తీసుకువచ్చారు. అంతలోనే గూండాలు దాడులకు పూనుకోవడంతో సంఘం కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. దొర మనుషులను కొట్టారనే నెపంతో కమ్మగాని చుక్క సోమయ్య, చిట్యాల నరసయ్య, చిట్యాల సోమయ్యలను పోలీసులు పట్టుకెళ్ళారు. అయిలమ్మ వారిని అడ్డుకుని ఎదిరించారు. దాంతో అయిలమ్మ కొడుకులు సోమయ్య, లచ్చయ్య భర్త నరసయ్యలను కుట్ర కేసులో ఇరికించి జైల్లో పెట్టారు. అయిలమ్మ ఎంతకీ లొంగి రావడం లేదనే కసితో ఆమె పంచ చేను కోసుకురమ్మని విస్నూరు దొర తన గూండాలను పంపుతాడు. ఈ వార్త తెలిసిన సంఘం నాయకులు గుత్పలు చేత పట్టుకొని అయిలమ్మ పంటను రక్షించేందుకు ముందుకు వచ్చారు. దాంతో సంఘ నాయకుల పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగింది. పార్టీ ఆదేశాలతో సుమారు 30 మంది పాలకుర్తికి చేరుకున్నారు. ఒకరోజు రాత్రి సుమారు వందమంది గూండాలను విస్నూరు దొర అయిలమ్మ పంట చేనుకు పంపాడు. సూర్యపేట నుండి వచ్చిన బీమ్‌ రెడ్డి నరసింహారెడ్డి, నల్లు ప్రతాపరెడ్డి, కాసం కృష్ణమూర్తి, పాలకుర్తి సంఘం కార్యకర్తలు 30 మంది కలిసి గూండాలను ఒక్కసారిగా అడ్డుకున్నారు. తరిమి తరిమికొట్టారు. ఈ సంఘటనతో పాలకుర్తిలో అయిలమ్మ విజేతగా నిలిచింది.
అజ్ఞాత జీవితం
సాయుధ పోరాటం ప్రారంభం కావడంతో అయిలమ్మ కుటుంబంపై కక్ష సాధింపులు పెరిగాయి. కుటుంబమంతా చెల్లాచెదురైంది. లచ్చయ్య, సోమయ్యలు సాయుధ సమరంలో దళ కమాండర్లుగా, ఏరియా కమిటీ నాయకులుగా ఉన్నారు. అయిలమ్మ బిడ్డ సోమనరసమ్మ కొరియర్‌గా సేవలందించింది. అయిలమ్మ అజ్ఞాతంలోకి వెళ్ళింది. 50 ఏండ్ల వయసులో నాయకులతో పోటీపడి పనిచేసింది. రక్షణ కోసం ఆమెకు పార్టీ తుపాకీ ఇచ్చి, ఎలా ఉపయోగించాలో నేర్పించారు. రైఫిల్‌ వినియోగించే అవసరం అయిలమ్మకు రాకపోవడంతో తిరిగి చకిలం యాదగిరికి అప్పగించారామె. రహస్యం జీవితం గడుపుతున్న అయిలమ్మను పట్టుకోవడానికి గాలిస్తున్న పోలీసులకు బొమ్మెర గ్రామంలో ఉన్నదని తెలియడంతో గ్రామాన్ని నైజాం పోలీసు దిగ్బంధనం చేసి, ఇల్లిల్లు జల్లెడపట్టారు. గొల్లవారి ఇంటిలో తలదాచుకున్న అయిలమ్మ గొల్లవారి లాగా తన వేషాదరణ మార్చుకొని ధూపబుడ్డి తలకెత్తుకొని గొర్ల మంద కాడికి పోతున్న గొల్లలతో పాటు బయలుదేరి వెళ్లి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది. ఇలా ఆమె జీవితంలో అనేక సంఘటను జరిగాయి.
స్ఫూర్తిదాయక జీవితం
అయిలమ్మ భర్త నరసయ్య, కుమారులు సోమయ్య, లచ్చయ్యలు నల్లగొండ జైల్లో దేశముఖ్‌ కుట్రలతో జైలుపాలయ్యారు. వారిని కలిసేందుకు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న నల్లగొండకు అయిలమ్మ కాలినడకనే వెళ్ళింది. పాలకుర్తి నుండి ఆమెతో పాటు కమ్మగాని సత్తెమ్మ, మామిళ్ళ లక్ష్మీదేవమ్మ, జీడి ముత్యాలమ్మ, మచ్చ రాజయ్య, చిట్యాల మల్లమ్మ, జీడి లక్ష్మీనరసమ్మ, మామిళ్ల గట్టు మల్లమ్మ, అంకిరెడ్డి నర్సమ్మ, చిట్యాల లక్ష్మీనరసయ్య నల్లగొండకు కాలినడకన అన్నం సద్ది మూటలు కట్టుకొని వెళ్లేవారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత అయిలమ్మతో పాటు ఆమె కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇలా చివరి వరకు స్ఫూర్తిదాయక జీవితం గడిపిన అయిలమ్మ తన 90 ఏండ్ల వయసులో 1986లో సెప్టెంబర్‌ 10వ తేదీన మరణించారు. అంతిమ యాత్రలో కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకత్వం, వివిధ రాజకీయ పార్టీల పాల్గొన్నారు. కామ్రేడ్‌ ఏ.సి.రెడ్డి నరసింహారెడ్డి అధ్యక్షతన పాలకుర్తిలో అయిలమ్మ సంస్మరణ సభ జరిగింది. అనేక గ్రామాల నుంచి వేలాదిగా పాల్గొన్న ఈ సభలో కామ్రేడ్‌. భీమిరెడ్డి నరసింహారెడ్డి, నీర్మాల కృష్ణమూర్తి, మోటూరు ఉదయం వంటి వానే ఐలమ్మ పోరాట పటిమను కొనియాడుతూ నివాళులర్పించారు.
– సాంబరాజు యాదగిరి

సంఘం బలోపేతం కోసం
ఆనాడు అయిలమ్మ ఇల్లే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం. అగ్ర నాయకులు అయిలమ్మ ఇంటికి వచ్చి పోతుండడంతో దొర గూండాలు, పోలీసుల నుండి రక్షించేందుకు అయిలమ్మకు మరింత పకడ్బందీగా రక్షణ కల్పించింది పార్టి. సంఘం ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కడవెండి, దేవరుప్పుల కేంద్రాలతో పాటు పాలకుర్తిని కూడా ప్రధాన స్థావరంగా పార్టీ ఎంచుకుంది. తెలంగాణ అగ్రశ్రేని నాయకత్వం అయిలమ్మ ఇంటికి వస్తున్నారనే విషయం విస్నూరు దొరకు కంటగింపయ్యింది. పాలకుర్తికి చకిలం యాదగిరిరావు బాధ్యులుగా ఉండి నడిపించారు. యాదగిరిరావు నేతృత్వంలో జీడి సోమనరసయ్య, చిట్యాల సోమయ్య, అంకిరెడ్డి సోమయ్య, జీడి బాలయ్య, వీరమనేని రామచంద్రయ్య, అయిలమ్మతో కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేశారు.
కమ్యూనిస్టులకు ఆశ్రయం
సంఘం పెట్టారనే కోపంతో కక్షగట్టిన పోలీసు పటేల్‌ వీరమనేని శేషగిరిరావు, ఐలమ్మ కుటుంబమంతా వచ్చి తన పొలంలో వెట్టి పనిచేయాలని ఆజ్ఞాపించాడు. అందుకామె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన శేషగిరిరావు, విస్నూరు దొరను కలిసి అయిలమ్మ కమ్యూనిస్టులకు ఆశ్రయం ఇస్తుందని, సంఘం బాగా బలపడిందని, ఇప్పటికే ప్రజలు తన మాట ఖాతార్‌ చేయడం లేదని అందుకు కారణమైన సంఘాన్ని నామరూపాలు లేకుండా చేయడమే మార్గమని చెప్పాడు. దాంతో విన్నూరు దొర అయిలమ్మ ఇంటి మీదికి గుండాలను పంపించాడు. ఆ గుండాలను అయిలమ్మ కుటుంబమంతా కలిసి తరిమి కొట్టింది. ఆ తర్వాత శివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రజా చైతన్యవేదికగా మార్చుకోవాలని స్థానిక నాయకులు నిర్ణయించుకున్నారు. సంఘం అభివృద్దికి ఈ సభ దోహదపడుతుందనే లక్ష్యంతో అప్పటి నల్లగొండ జిల్లా నాయకత్వం సభ ఏర్పాటు చేసింది.

Spread the love