స్కూల్ బస్సు బోల్తా… ఆరుగురు చిన్నారులు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: హర్యానా (Haryana) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఈద్‌-ఉన్‌-ఫితర్‌ సెలవు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న జీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌ (GL Public School)ను అధికారులు తెరిచారు. దీంతో పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తోంది. ఈ క్రమంలో నార్నౌల్‌ సమీపంలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తాపడింది. అనంతరం పల్టీలు కొట్టడంతో బస్సులోని ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు పది పందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందిదాకా చిన్నారులు ఉన్నట్టు సమాచారం.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో బస్సు నడిపి చెట్టుకు ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆరేండ్లు క్రితం 2018లోనే బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ గడువు ముగిసినట్టు అధికారిక పత్రాల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Spread the love