నవతెలంగాణ – హైదరాబాద్: తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది. అలాగే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం రాత్రి 2 గంటల సమయంలో ఒయన్జీసీ కూడలి సమీపంలో చోటు చేసుకున్నట్లు డెహ్రాడూన్ ఎస్పీ సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు. మృతులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును కంటైనర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కంటైనర్ డ్రైవర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు మృతి చెందగా, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మృతుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉంటుందని sp ప్రమోద్ కుమార్ చెప్పారు.