ఉత్తరాఖండ్ : కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల …. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదలొ చ్చాయి. ఈ వరదల్లో చిక్కుకొని ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కుమావోన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలోనే కుమావోన్ ప్రాంతంలోని హల్ద్వానీలో 337, నైనిటాల్‌లో 248, చంపావత్‌లో 180, చోర్గాలియాలో 149, రుద్రాపూర్‌లో 127 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 324 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీ బండరాళ్లు, శిథిలాలు పేరుకుపోయాయి. రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా ఈ మార్గాలను తెరిచేందుకు కషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ వర్షాలు చార్ దామ్ యాత్రపైనా తీవ్ర ప్రభావం చూపాయి. యాత్రకు వెళ్లే మార్గంలో తరచూ రోడ్లు మూతపడుతుండటంతో రాక పోకలకు అంతరాయం కలుగుతోంది.