బైక్​లపైకి దూసుకెళ్లిన లారీ..ఆరుగురు మృతి

నవతెలంగాణ – తమిళనాడు
అదుపుతప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించి ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రోడ్డు దాటుతున్న మూడు బైక్​లపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో బైక్​లపై ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం తమిళనాడు.. చెంగల్పట్టు జిల్లాలోని పొతేరి సమీపంలో నేడు ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్​మార్టం పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు. బైక్​లను ఢీకొట్టిన అనంతరం లారీ.. బారికేడ్​ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. మద్యం మత్తులో లేదా నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్థానికులు భారీగా చేరుకోవడంతో.. కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టారు.

Spread the love