– హా… హా… హా… మన తెలుగోడి దెబ్బ. గోల్కొండ అబ్బ. ట్రిపుల్ ఆర్ సినిమా పాన్‌ఇండియా ఏం కర్మ..? సరాసరి ఆస్కార్ ముంగిట్లోనే వాలింది. అవార్డు కొట్టేసింది. ఏమేవ్! వింటున్నావా…
– చాల్లేండి సంబడం. సినిమా తీయడానికి వందల కోట్లు. ఆపైన ప్రమోషన్‌కు పదుల కోట్లు.
– ఆ… అంటే ఏంటీ నీ ఉద్దేశ్యం. తెలుగు సినిమా అంటే నీకు లెక్కేలేదా..?
– ఎందుకు లేదు. గుండమ్మ కథ, మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి వంటి పాత సినిమాలు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాంగా.
– అయితే ట్రిపుల్ ఆర్ నీకు నచ్చలేదా..? ప్రపంచం అంతా బ్రహ్మరథం పడుతూవుంటే నీవు మాత్రం ఆ పాత సినిమాల గోల నుండి బయటపడకపోతే నేనేం చేయలేను. సారీ…
– చూడండి సినిమా అంటే నా దృష్టిలో ఓ రసరమ్య కావ్యం. మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం. హృద్యమైన మన అనుభూతులను అంతా కలసి హాయిగా నెమరువేసుకోవడం.
– అందుకేగా ది గ్రేట్ రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌తో ట్రిపుల్ ఆర్ వచ్చింది. వందల కోట్లు ఖర్చుపెట్టింది. అసలు రాజమౌళి బహుబలి కోసం 200కోట్లు ఖర్చుపెడితేనే…. అప్పుడు ఓ తెలుగు సినిమాకు ఇంత పెట్టుబడి ఎలా తిరిగి వస్తుందిరా బాబు అనుకున్నాం. జనం సక్సెస్ చేసి చూపించారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం 600కోట్లు ఖర్చుపెట్టారు. ప్రమోషన్‌కోసం మరికొన్ని కోట్లు తెలుసా..? నీవన్నట్టు…
– అంటే ఇదంతా సినిమా సక్సెస్ కోసం పెట్టుబడిలో భాగమే కదండీ…
– మరి సినిమా అంటే మాటలా… ఎంత ఖర్చు. ఎంత పెట్టుబడి. 24 క్రాప్ట్స్ ఉంటాయి. వందల మంది నెలలు, సంవత్సరాల తరబడి రేయింబవళ్ళు అహరహం శ్రమిస్తారు. నీ చిన్న బుర్రకు ఇవేం అర్థం కావులే.
– నేనూ అనేది అదే. సినిమా అంటే కేవలం పెట్టుబడి – శ్రమ – లాభాలే కాదు… అందులో కొన్ని విలువలు, కొంత యథార్థం, విజ్ఞానం, పొందిక ఉండాలని అంటున్నాను. కోట్ల రూపాయల లాభాలు, గుర్తింపు వచ్చినంత మాత్రాన మంచి సినిమా అయిపోదండీ…
– అంటే, ట్రిపుల్ ఆర్ సినిమా నీకు మంచి సినిమా కాదా? ఏంటి? అన్ని డబ్బులు ఖర్చు చేయడం, పెట్టుబడి పెట్టడం వేస్ట్ అంటావా ఏంటీ?
– ఎందుకలా ఉడుక్కుంటారు. ట్రిపుల్ ఆర్ గొడవ ఎత్తింది మీరు. పొంగిపోతున్నది మీరు. నేను కూడా మీలా పొంగిపోవాలంటే ఎలా కుదురుతుంది? నా సొంత అభిప్రాయాలంటూ నాకుండవా ఏంటి?
– సొంత అభిప్రాయాలా… ఏమిటో అవి?
– చిన్న బడ్జెట్‌తో కూడా మంచి చిత్రాలు ఒద్దిగ్గా తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సత్యజిత్ రే, మృణాల్ సేన్‌లే కాదు, మన తెలుగులో బాపు-రమణలు, విశ్వనాథ్, బాలచందర్‌లు అద్భుత చిత్రాలు తీయలేదా ఏంటి? ఎన్ని సామాజిక వాస్తవికతలు, ఎంత సౌందర్యం… కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అవి సమాజాన్ని ఎంతగానో ముందుకు నడిపిస్తాయి.
– అంటే ట్రిపుల్ ఆర్‌లో ఇవి లేవా?
– అదిగో మీరు అక్కడే ఆగిపోయారు. నేనేమన్నానంటే… డబ్బు ఒక్కటే సర్వస్వం కాదు. రాబడి కొలమానం అనుకుంటే అశ్లీల బూతు చిత్రాలకు ఫాంటసీ చిత్రాలకు కొదవేముందీ అని.
– అయితే ఇంతకీ ఏమంటావేంటి?
– ఇందాక మీరే అన్నారు కదా… సినిమా అంటే 24క్రాఫ్ట్‌లని, వందలాదిమంది నెలలు తరబడి చేసే శ్రమ అని..
– అవునూ…
– సినిమా అంటే ఏ కొద్దిమంది కలయికో, వందల కోట్ల పెట్టుబడే కాదు, అంతకు మించి సమిష్టి సృజన శీల కృషి, ఫలితంగా వచ్చే సామాజిక చైతన్యం అని నా భావన.
– కాస్త అర్థమయ్యేట్టు మాట్లాడు.
– నేను మాట్లాడేది తెలుగే. కళా సృజన శీలత ఏ ఒక్కరి సొత్తూ కాదండీ. ఎవరి ప్రతిభ వారిదే… చిన్న బడ్జెట్ చిత్రాల్లో కూడా ఊహించని అద్భుత సృజన శీలత ఉంటుందని, ఆ సృజనశీలతే అంతిమంగా ఓ చైతన్యధారగా మారి ప్రేక్షక హృదయాల్లో ప్రవహిస్తుందని చెపుతున్నాను.
– ఆహా… అలాగా… ఓ ఉదాహరణివ్వు.
– నేను ఈ మధ్యన ‘ది గ్రేట్ ఇండియన్ కిచన్’ మళయాళ సినిమా చూసాను. ఆ సినిమాలో హీరోయిన్ చదువుకున్న స్త్రీనే. ఆ హైందవ స్త్రీ భర్త మాట జవదాటకుండా, భర్తకు ఎదురు చెప్పకుండా ఇంట్లో వారందరికీ, అతిథులకు కోరిన విధంగా వండి వార్చిపెడుతుంది. రేయింబవళ్ళు వంటింట్లోనే గడపవలసి వస్తుంది. ఒకరోజు అనుకోని విధంగా భర్తతో కలసి ఓ రెస్టారెంట్‌కు వెళుతుంది. అక్కడ భోజనం చేస్తూ భర్త, ములక్కాడలు సగం సగం చీకి టేబుల్‌పై శుభ్రంగా పరిచిన వస్త్రంపై ఎంగిలి పడేస్తాడు. భార్య అప్పుడు ఇబ్బందిపడుతూ… చిన్నగా… ‘టేబుల్ మానర్స్ కాస్త పాటించండి’ అంటుంది. అదిగో అదే ఆ భర్తకు తప్పైపోతుంది. నాకు మానర్స్ లేదంటావా..? అంటూ రెచ్చిపోతాడు. అంటే భర్తకు భార్య మానర్స్ గురించి చెప్పకూడదా? అనే ప్రశ్న అప్పుడు నాకు ఉదయించింది. ఇప్పటికీ అది తొలుస్తూనే ఉన్నది.
– ఏమిటి నీ ఉద్దేశ్యం. నాకు మానర్స్ లేదా..?
– చూశారా.. ఇప్పుడు కూడా మీ గురించి మీరే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకుంటున్నారు.
– డొంక తిరుగుడెందుగ్గానీ, సూటిగా చెప్పి తగలడు.
– ఇందులో తగలడ్డానికి ఏముంది. వడ్లగింజలో బియ్యపు గింజ. సంస్కారం నేర్చుకుంటే వస్తుంది. బోకరిస్తే రాదు. భాష కూడా… అంతే!
– కె శాంతారావు
9959745723