– ప్రదానం చేసిన ఎఫ్‌ఐసీసీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎఫ్‌ఐసీసీ) స్మార్ట్ పోలీస్ అవార్డును ప్రదానం చేసింది. గతంలో రాచకొండ కమిషనర్‌గా పని చేసిన మహేశ్ భగవత్.. చౌటుప్పల్, బొమ్మలరామారం ప్రాంతాల్లోని ఇటుక బట్టీలలో పని చేస్తున్న 300కు పైగా పిల్లలను వెట్టిచాకిరి నుంచి రక్షించారు. అంతేగాక, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన ఈ పిల్లలు వారి స్వంత కుటుంబాల చెంతకు చేరేవరకు తాత్కాలికంగా స్కూళ్లలో చేర్పించారు. వారి చదువులకు అవసరమైన నిధులను ఇటుక బట్టీల యాజమాన్యాల నుంచి సేకరించారు. అంతేగాక, ఆ బాలలకు ఒడిశా, మహారాష్ట్రల నుంచి టీచర్లను రప్పించి వారి స్వభాషలోనే చదువు సాగేలా చూశారు. ఇందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాయి. అనంతరం, ఆ పిల్లలను ఒడిశా, మహారాష్ట్రలలోని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇందుకు గానూ, ఎఫ్‌ఐసీసీవారు ఏర్పాటు చేసిన బాలల సేఫ్టీ సెక్యూరిటీ అవార్డుల విభాగంలో మహేశ్ భగవత్ ఎంపికయ్యారు.