రైతుల కోసంస్మార్ట్‌ సొల్యూషన్‌

రైతుల కోసంస్మార్ట్‌ సొల్యూషన్‌వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చిన ఆమె పారిశ్రామిక వేత్తగా మారింది. రైతులు ఎదుర్కొం టున్న విభిన్న సవాళ్లను ప్రత్యక్షంగా అర్థం చేసుకుంది. అందుకే వ్యవసాయదారులను డిజిటల్‌గా శక్తివంతం చేసేందుకు భారత్‌అగ్రిని నిర్మించింది. ఆమే సాయి గోలే. రైతులకు పంట ఉత్పాదకతను పెంచడానికి స్మార్ట్‌ సొల్యూషన్‌లను అందించేందుకు టెక్‌ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
వ్యవసాయ కుటుంబం కనుక రైతుల అప్పులు, పంట నష్టాల కారణంగా రైతు ఆత్మహత్యలకు పేరుగాంచిన విదర్భ వంటి ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లు, నష్టాలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె కుటుంబం నాగ్‌పూర్‌కు 120 కి.మీ దూరంలోని ఆర్వీలో ఉన్న తమ పొలాల్లో పంటలు పండించేవారు. కుటుంబ సభ్యుల అనుభవాలు యువ సాయిని ఆలోచించేలా చేశాయి. రైతులకు సహాయం చేయడానికి అవసరమైన పరిష్కారాల కోసం వెతకడం మొదలుపెట్టింది. మహారాష్ట్రతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఈ వెదుకులాటే ఐఐటి-మద్రాస్‌లోని ఆమె బ్యాచ్‌మేట్‌ అయిన సిద్ధార్థ్‌ డయాలనీతో కలిసి 2017లో భారత్‌అగ్రిని ప్రారంభించేలా చేసింది. ఇది రైతులకు ఎప్పుడు, ఏమి, ఎలా పండించాలో, ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచడానికి స్మార్ట్‌ వ్యవసాయ సలహాలు ఇస్తుంది.

ఆత్మహత్యలు సర్వసాధారణం 
‘మా మామయ్యకు అర్వీలో వ్యవసాయ భూమి ఉండేది. మేము ప్రతి వారాంతంలో కుటుంబాన్ని కలవడానికి వెళ్తాం. మేము ఎక్కువగా పత్తి, సోయాబీన్‌, చిక్‌పీస్‌లను పండించే వాళ్ళం. అవి అంత లాభదాయకమైన పంటలు కావు. నా యుక్తవయసులో రైతు ఆత్మహత్యల వార్తలు సర్వసాధారణం. ఇలా ఎందుకు జరుగుతోందని మా మామను చాలా సార్లు ప్రశ్నించాను’ అని సాయి గుర్తు చేసుకుంది. కొంతకాలానికి రైతులలో విద్య లేకపోవడం, పాత పద్ధతులు అనుసరించడం వారి ఎదుగుదలకు ఆటంకం ఏర్పడిందని ఆమె అర్థం చేసుకుంది. ‘రైతుల విద్యా పరిధి చాలా తక్కువ స్థాయిలో ఉంది. అయితే మన దేశంలో ఇతర రంగాలు ఎంతో ముందుకు పోతున్నాయి. కానీ వాతావరణాన్ని తట్టుకోగలిగేలా వ్యయసాయాన్ని అభివృద్ధి చేయడంలో వారికి జ్ఞానం పెద్దగా పెరగలేదు’ అని ఆమె అంటుంది.

సలహాలు ఇచ్చేవారు లేరు 
గోలే చెన్నైకి వెళ్లి ఐఐటీ మద్రాస్‌లో ప్రోడక్ట్‌ డిజైన్‌లో బీటెక్‌ చేసినప్పటికీ ఆర్వీలోని తమ పొలాల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేది. ప్రతి సీజన్‌లో నష్టపోతున్నారనే వార్తే వచ్చేది. ఇక వ్యవసాయంపై మాత్రమే ఆధారపడిన ఇతర రైతుల స్థితి గురించి కూడా ఆమె ఆలోచించింది. అన్ని రంగాలలో అందుబాటులో ఉన్నట్టు వ్యవసాయ రంగంలో సలహాలు ఇచ్చేవారు లేరు. రైతులు కూడా తమ నష్టాన్ని పట్టించుకోకుండా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ‘నేను నా సొంత కుటుంబంలోనే దీన్ని చూశాను. దీనిపై నేను ఎంతో ఉత్సాహంతో మామయ్యతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. చాలా విషయాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. ఉదాహరణకు మేము పత్తిని ఎందుకు పండిస్తున్నాము, సమాంతరంగా ఎందుకు పండించలేకపోయాము వంటి వాటి గురించి అధ్యయనం చేసేదాన్ని’ అని ఆమె పంచుకున్నారు.

ఇద్దరూ కలిసి 
కాలేజీలో తనతో పాటు రోబోటిక్స్‌ గ్రూప్‌లో భాగమైన సిద్ధార్థ్‌ డియాలనీని కలుసుకుంది. ఆమె తన అన్వేషణలు, ఆందోళనలను అతనితో పంచుకుంది. ‘సిద్ధార్థ్‌కు కూడా దీనిపై ఆసక్తి కలిగింది. మేమిద్దరం చెన్నై సమీపంలోని రైతులను కలిశాము. అగ్రికల్చర్‌, బయోటెక్నాలజీలో ఉన్న చాలా మంది ప్రొఫెసర్‌లతో మాట్లాడాము. అతను తన ఎంటెక్‌ సబ్జెక్ట్‌ను బయోటెక్నాలజీకి మార్చుకున్నాడు. ఇద్దరం వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సేకరించేందుకు ప్రయత్నించాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద అవకాశంగా, సాంకేతికతకు సంబంధించి మిస్సింగ్‌ లింక్‌గా మేము చూశాము’ అని ఆమె చెప్పారు.

ఉద్యోగం విడిచిపెట్టింది
ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ వ్యవసాయ ప్రక్రియలోని విభిన్న అంశాలను అర్థం చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఆమె ఐటీసీలో ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను ఎంచుకుంది. అయితే సిద్ధార్థ్‌ వ్యవసాయ శాస్త్రంలో కోర్సు చేయడానికి ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. అతను అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత సాయి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఇద్దరూ తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఏడాది పాటు పూణే సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. ‘మేము కొన్నేండ్లుగా వ్యవసాయ రంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సరైన సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నాము’ అని ఆమె చెప్పింది.

కమ్యూనికేషన్‌లో మార్పు 
వ్యవసాయం సంక్లిష్టమైన శాస్త్రం. సరైన సమయంలో అన్ని విషయాలను సమీకరించడం రైతుకు సాధ్యం కాదని ఇద్దరూ అర్థం చేసుకున్నారు. అందుకే రైతుల నుండి డేటాను సేకరించి వారికి అవసరమైన సమాచారాన్ని అందించే మొదటి ప్రయత్నాన్ని 2017లో ప్రారంభించారు. ‘ప్రారంభ దశలో మేము ఒక రసాయన సమ్మేళనం పేరును బ్రాండ్‌ న్యూట్రల్‌గా సూచించేవాళ్ళం. వారం తర్వాత రైతును కలిసినప్పుడు ఆ పేరును అర్థం చేసుకునేవారుకాదు. కనుక కమ్యూనికేషన్‌ వేరే స్థాయిలో ఉండాలని మాకు తెలిసింది’ ఆమె చెప్పింది. వారు తమ పైలట్‌ను మహారాష్ట్రలోని నారాయణగావ్‌లో నడిపారు. 12 నెలలు వివిధ పంటలతో ప్రయోగాలు చేశారు. కానీ చెరకు, స్వీట్‌కార్న్‌ వంటి వాటిలో కొన్ని అస్సలు పెరగలేదని ఆమె చెప్పారు. ఇలాంటి కారణాల వల్లనే రైతులు నిత్యం నష్టపోతున్నారని తెలుసుకున్నారు. అందుకే ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు.
అగ్రి డాక్టర్‌తో… 
BharatAgri ఇప్పుడు తన వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా 350కి పైగా పంటల కోసం రియల్‌ టైమ్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ అప్‌డేట్‌లతో విత్తడం నుండి కోత వరకు భద్రత కోసం సమర్థవంతమైన పంట నిర్వహణ సలహా వేదికగా మారింది. అలాగే పంట-నిర్దిష్ట సమాచారాన్ని పొందడానికి, మారుతున్న వాతావరణం ఆధారంగా వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా అందిస్తుంది. రైతు పంట ప్రతి దశలో సలహాల కోసం నిపుణుడిని సంప్రదించవచ్చు. తమ సమస్యలను అగ్రి డాక్టర్‌తో పంచుకోవచ్చు. ఈ సెంటర్‌ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుండి ఎక్కువ మంది రైతులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. దీని వినియోగదారులలో ముప్పై శాతం మంది దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చారు. మరాఠీ, హిందీ, ఇంగ్లీషులో సలహాలు ఇస్తారు. త్వరలో గుజరాతీ, భోజ్‌పురికి విస్తరించబడుతుంది. రైతులు తమ పరిష్కారాలను వీడియోలు, ఆడియో లేదా టెక్స్ట్‌ రూపంలో పొందుతారు. యాప్‌లోని సమాచారాన్ని వినియోగించుకోవచ్చు లేదా వాట్సాప్‌లో స్వీకరించవచ్చు. ‘మేము పొలం కోఆర్డినేట్‌లను నమోదు చేయమని రైతును అడుగుతాము. తద్వారా మేము వారికి ఆ ప్రదేశ వాతావరణ సమాచారాన్ని అందించగలం. వ్యవసాయ క్షేత్రం ఉపగ్రహ మ్యాపింగ్‌ను కూడా నిర్వహిస్తాము’ అని ఆమె చెప్పింది.
సలహా విలువైనదిన 
రైతులు BharatAgri యాప్‌ వారి 30 రోజుల ఉచిత ట్రయల్‌ని పొందుతారు. ఆ సర్వీస్‌ పోస్ట్‌ను పొందడానికి ఛార్జీ విధించబడుతుంది. ప్రస్తుతం ఐదు మిలియన్ల మంది రైతులను కలిగి ఉంది. అలాగే 1.5 మిలియన్ల మంది రైతులు ప్రతి నెలా ఏదో ఒక రూపంలో సలహాను వినియోగిస్తారు. ఇది రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రైతులు ఇంటర్నెట్‌ను ఉచితంగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డారు. కాబట్టి మొదటి మూడేండ్లు వారికి డబ్బు చెల్లించడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ సలహా విలువైనది అయితే వారు చెల్లించడానికి వెనుకాడరని నిరూపించాల్సి వచ్చింది. ఇది నిధుల సమీకరణలో కూడా వారికి సహాయపడింది. రాబోయే రెండు మూడేండ్లలో BharatAgri ఈకామర్స్‌, ఇన్‌పుట్‌ సలహాలపై దృష్టి పెడుతుంది. ఆ తర్వాత ఫైనాన్స్‌ భాగస్వాములను కూడా ఏకీకృతం చేయబోతోంది. ఇది త్వరలో గుజరాత్‌, కర్ణాటక, తెలంగాణకు కూడా విస్తరించబోతోంది.
స్నేహితుడిలా మారింది
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ జిల్లాకు చెందిన మొయిన్‌ మన్సూరి అనే రైతు మాట్లాడుతూ ‘నేను భారత్‌అగ్రి యాప్‌లో పంటల షెడ్యూల్‌ను నమోదు చేసాను. పంటకు ఎప్పుడు నీరు పెట్టాలి, ఎప్పుడు పిచికారీ చేయాలి, బయో స్లర్రీని ఎలా తయారు చేయాలి, వ్యవసా యానికి సంబంధించిన ఇతర పనుల గురించి వారు నాకు సంబంధిత సమాచారాన్ని అందిస్తారు. నేను నా ఎరువుల న్నింటినీ అక్కడి నుండే ఆర్డర్‌ చేసాను. అవి అత్యధిక నాణ్యతతో ఉన్నాయి. నాకు ఏదైనా సమస్య ఉంటే నేను కూడా వీడియో కాల్‌ చేసి అగ్రి-డాక్టర్‌ నుండి సలహా తీసుకుంటాను. భారత్‌అగ్రి నాకు ఓ స్నేహితుడిలా మారింది.

Spread the love