– బ్రేక్స్ పట్టి వేయడంతో ఘటన
– భయపడాల్సింది ఏమీ లేదు : స్టేషన్ మాస్టర్ అభినవ్
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ఆదివారం పొగలు రావడంతో రైలును నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నిలిపివేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గరై బోగీల నుంచి దూరంగా వెళ్లిపోయారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, నాలుగు రోజుల కిందట కూడా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. దాంతో రైలును మిర్యాలగూడ వద్ద 25 నిమిషాల పాటు నిలిపివేశారు. జన్మభూమిలో వరుసగా ఘటనలు చోటుచేసుకోవడంతో రైలును పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఘటనపై నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ అభినవ్‌ను వివరణ కోరగా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు తిప్పర్తి సమీపానికి రాగానే ఒక్కసారిగా బ్రేక్స్ పట్టి వేయడంతో పొగలు వచ్చాయని తెలిపారు. దాంతో వెంటనే రైలును నిలిపివేసి మరమ్మతులు చేసినట్టు చెప్పారు.