ఎగిసిన ద్రవ్యోల్బణం

Soared inflation– 14 నెలల గరిష్టానికి ధరలు
– అక్టోబర్‌లో 6.2 శాతానికి చేరిక
న్యూఢిల్లీ : దేశంలో ధరలు ఎగిసిపడుతున్నాయి. అధిక అహారోత్పత్తుల ధరలు వినియో గదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ)కి ఆజ్యం పోశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం సూచీ 6.21 శాతానికి ఎగిసి.. 14 నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించుకున్న స్థాయి కంటే ఎక్కువ కావడం ఆందోళనకరం. ఇంతక్రితం సెప్టెంబర్‌ నెలలో సిపిఐ 5.49 శాతంగా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా నమోదయ్యింది. బుధవారం కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) వెల్లడించిన రిపోర్ట్‌ ప్రకారం.. గడిచిన అక్టోబర్‌లో ఆహార పదార్థాల ధరలు 10.87 శాతానికి ఎగిశాయి. ఇంతక్రితం మాసంలో ఇది 9.24 శాతంగా ఉంది. గతేడాది ఇదే అక్టోబర్‌ నెలలో ఆహార పదార్థాల ధరల సూచీ 6.61 శాతంగా నమోదయ్యింది. ”అక్టోబర్‌లో అధిక అహార ద్రవ్యోల్బణం చోటు చేసుకుంది. ముఖ్యంగా కూరగాయలు, పళ్లు, చమురు, కొవ్వుల ధరలు పెరిగాయి.” అని ఎన్‌ఎస్‌ఒ వెల్లడించింది. సెప్టెంబర్‌లో కూరగాయల ద్రవ్యోల్బణం 36 శాతానికి చేరగా.. అక్టోబర్‌లో 42.2 శాతానికి ఎగిసింది. వంట నూనెలు 9.5 శాతం ప్రియమయ్యాయి. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి రెండు శాతం అటూ, ఇటుగా నియంత్రించాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఆరు శాతం ఎగువకు చేరడంతో ఆర్‌బిఐ మానిటరీ పాలసీపై ఒత్తిడి పెరగనుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి ధరలు ప్రధాన అడ్డంకిగా మారనున్నాయి. ఇప్పటికే హెచ్చు వడ్డీ రేట్లతో రుణ గ్రహీతలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ తాజా ద్రవ్యోల్బణ గణంకాలతో ఇప్పట్లో రేట్లు తగ్గే అవకాశాలు లేదని స్పష్టమవుతోంది.

Spread the love