– అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలి : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో ముఖాముఖి
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
సమాజం అంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేందుకు, తద్వారా మెరుగైన జీవితాలు పొందేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, ఇందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 475 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని, స్వచ్ఛభారత్ అనేది ఒక కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని, భవిష్యత్ అభివృద్ధి మహిళా సాధికారతపై ఆధారపడి ఉందని చెప్పారు. విద్యార్థులకు విద్యతోపాటు, చిన్న చిన్న చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీ, పరికరాల తయారీ వంటివి తెలియజేయాలని అన్నారు.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేకించి ఐటీ, ఫార్మా, సైన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే కాకుండా, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని అన్నారు. ప్రతి ఏడాదీ ఆరు లక్షల ఎకరాల నూతన ఆయకట్టును సృష్టించి వచ్చే ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి వారి రంగాల్లో చేసిన కృషిని రాష్ట్ర గవర్నర్‌తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చన, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, తిరుమలగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.