సమాజ పునర్జీవనం జరగాలి

సమాజ మార్పునకు సాంస్కృతిక రంగం కీలకం
– సెల్‌ఫోన్లు పక్కనబెట్టండి..పిల్లలకు విలువలు నేర్పండి
– పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే
– సరళ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి
– సుందరయ్య స్ఫూర్తితో ముందుకెళ్దాం
– గచ్చిబౌలి ఎస్వీకేలో సుందరయ్య 38వ వర్థంతిలో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ పునర్జీవనం జరగాల్సిన అవసరం ఉందనీ, సమాజ మార్పుకు సాంస్కృతిక రంగమే కీలకమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం(గచ్చిబౌలి) ట్రస్టు చైర్మెన్‌ బీవీ.రాఘవులు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఎస్వీకేలో సుందరయ్య 38వ వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే ఇన్‌చార్జి పి.ప్రభాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వం వహించారని చెప్పారు. సమాజ సేవకు ఆటంకం అవుతుందనే ఉద్దేశంతో సుందరయ్య దంపతులు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారని కొనియాడారు. అన్ని అంశాలపైనా ఆయనకు పట్టు ఉండేదనీ, ఆయన షర్టుకున్న పెద్ద జేబులోనే ప్రపంచ సమాచారం ఉండేదని చెప్పారు. కొత్త అంశాలేమైనా ఉంటే జేబులో నుంచి పేపర్‌ తీసి నోట్‌ చేసుకునేవారని గుర్తుచేశారు. ఆయన సామాజిక దృక్పథం, ఎంచుకున్న సిద్ధాంతం, నిరాడంబరతే ఆయన్ను గొప్ప నేతగా నిలబెట్టాయని చెప్పారు. దుర్మార్గమైన నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రైతులకు పది లక్షల ఎకరాల భూమిని పంచి చరిత్రలో నిలిచిపోయిందనీ, అది దేశాన్నే ప్రభావితం చేసిన మహత్తరమైన పోరాటమని చెప్పారు. మన రాజ్యాంగంలో సోషలిజం అనే పదాన్ని చేర్చడానికి ఈ పోరాటమూ ఒక కారణమేనని చెప్పారు. తెలంగాణలో వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడటమే కాకుండా పాఠశాలలు పెట్టి తెలుగులో చదువు చెప్పిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు.
కలివిడిగా లేం.. విడివిడిగానే ఉంటున్నాం..
ఐక్యంగా కలిసి ఉంటేనే శక్తి పెరుగుతుందనే విషయాన్నే మనం మరిచిపోతున్నామనీ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలివిడిగా కాకుండా విడివిడిగానే ఉంటున్న పరిస్థితి ఉందని రాఘవులు అన్నారు. ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఆధునీక జీవన విధానం, పోటీ ప్రపంచం మనిషిని ఒంటరితనానికి అలవాటు చేస్తున్నదనీ, ఇది సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, తల్లిదండ్రులు ఎవరికి వారే ఒక్కొక్కరు ఒక్కో ఫోన్‌లో మునిగిపోతున్నారనీ, దీంతో కుటుంబంలోనూ ఒంటరితనమే కనిపిస్తు న్నదని వాపోయారు. గతంలో విజ్ఞానాన్ని ఒకరి కొకరు పంచుకునేవారనీ, నేడు అది వ్యాపారమయం అయిందని చెప్పారు. మనుషుల మధ్య సహకారం పోయి పోటీ మాత్రమే మిలిగిందన్నారు. మనుషుల మధ్య ప్రేమలు, అప్యాయతలు కరువయ్యా యన్నారు. ఇలాంటి సమయంలో సాంస్కృతిక రంగంలో విప్లవం రావాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను మంచి విలువలతో పెంచాలని కోరారు. లేనిపక్షంలో సమాజానికి తీవ్ర నష్టం చేకూరుతుం దని అభిప్రాయపడ్డారు. అల్లరి చేయొద్దని పిల్లలకు సెల్‌ఫోన్లు ఇచ్చే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు బయటపడాలని సూచించారు. సెల్‌ఫోన్లకు పిల్లలను అలవాటు చేసి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆస్పత్రులు, సలహా కేంద్రాల చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పారు.. స్థూలకాయత్వం పెరగ డానికి సెల్‌ఫోన్లు కూడా ఒక కారణమేనని నొక్కి చెప్పారు. వాకింగ్‌కు కార్లలో పోయి అక్కడ పది నిమి షాలు నడిచి మళ్లీ కారు ఎక్కి వస్తే ఏం ప్రయోజ నమని ప్రశ్నించారు. సహజ వనరులను అవసరం మేరకే వాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంద న్నారు. ఆధునిక జీవన పద్ధతులతో రాబోయే కాలం లో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాద ముందనీ, ఎండలతో మనుషుల మరణాలు ఎక్కువ య్యే రోజులు రాబోతున్నాయని ఆందోళన వ్యక్త పరి చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే ట్రస్టు సభ్యులు ఆర్‌.సాంబశివరావు, శ్రీనివాస్‌, భూమిక వ్యవస్థాపకులు ఉదయభాను, ఎస్వీకే బాధ్యులు విజరు, రవి, అనిల్‌, సీఐటీయూ నాయకులు శోభన్‌, తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీకే సిబ్బందికి బట్టల పంపిణీ
ఎస్వీకేలో పనిచేసే సిబ్బందికి రాఘవులు తన చేతుల మీదుగా బట్టలను అందజేశారు. ప్రతిఒక్కరినీ ఆయన పలుకరించారు. ప్రతి ఏటా సుందరయ్య వర్థంతి సందర్భంగా సిబ్బందికి బట్టలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
ఆకట్టుకున్న ‘బరుబత్తల రాజు’ నాటిక
ఈ సందర్భంగా భూమిక నాటక బృందం మంచి నాటకం ప్రదర్శించింది. ప్రస్తుత సమాజంలో అవసరం లేకున్నా ఇతరులను చూసి గొప్పలకు పోయి సామాన్యులు ఆర్థికంగా ఏవిధంగా చితికి పోతున్నారనే కాన్సెప్ట్‌తో ప్రదర్శించిన బరుబత్తల రాజు అనే హాస్యభరిత నాటిక అందర్నీ ఆకట్టు కున్నది. ఫ్యాషన్‌ షోలు, మాయాప్రపంచంలోని రంగురంగుల బట్టలను చూసి అవసరం ఉన్నా లేకున్నా ఒకే రోజు కోసం వేలు వేలు పెట్టి కొంటూ వనరులను ఏవిధంగా దుర్వినియోపరుస్తున్నామనే విషయం ఆలోచింపజేసింది. సహజవనరులు, ప్రకృతి విధ్వంసం జరుగుతున్న తీరును కండ్లకు కట్టినట్టు చూపెట్టారు.

Spread the love