రుణ యాప్‌ వేధింపులతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

నవతెలంగాణ – అమరావతి
రుణ యాప్‌ వేధింపులతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఎస్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌.ఐ.రామ్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం రైతు జయరామిరెడ్డి కుమారుడైన శ్రావణ్‌కుమార్‌రెడ్డి బీటెక్‌ పూర్తిచేసి ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందట రుణయాప్‌లో అప్పు తీసుకున్నారు. యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో రూ.3.50 లక్షల వరకు చెల్లించినా వేధింపులు కొనసాగుతునే వున్నాయి. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అప్పులు తీర్చుకునేందుకు రూ.4 లక్షలు కావాలని తండ్రిని కోరడంతో వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు కొంతమేర ఇప్పటికే జమ చేశారు. ఈ నెల 26న డబ్బు ఇచ్చేందుకు తండ్రి ఏర్పాట్లు చేశారు. అయితే శ్రావణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి తన బంధువుల ఊరైన మొరంపల్లెకు చేరుకుని అక్కడి పూతపల్లేశ్వరస్వామి ఆలయంలోని కిటికీ కమ్మీలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మృతుడి తల్లి దండ్రులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి తన వెంట కొత్తగా కొనుగోలు చేసిన కొడవలితో పాటు కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌.ఐ.మాట్లాడుతూ బుధవారం రాత్రి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని, రుణయాప్‌ ఆగడాలతో పాటు క్రికెట్‌ బెట్టింగులకు అప్పులు చేసి ఉండవచ్చునన్న కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Spread the love