కవులు తమ వ్యక్తిగత కవితా సంపుటాల ద్వారా ప్రపంచాన్ని మేల్కొలపడం ఒక ఆనవాయితీ. అదేవిధంగా కవులు సమూహంగా ఒక సందర్భానికి కలాలెత్తి ఒక సంపుటి కోసం అక్షరసేద్యం చేయడమూ సాంప్రదాయమే. దేశీయుల్లో చైతన్యకెరటాలు వెల్లువెత్తడానికి కవులు, సాహితీకారులు ముందు వరుసలో ఉంటారు. వారిది గురుతరబాధ్యత. సమాజానికి అదెంతో అవసరం.
దేశాలకు, దేశీయులకు యుద్ధాలు కొత్త కాదు. యుద్ధానంతరం చితికిపోయిన యుద్ధ దేశాలు కోలుకోవడం అంత సులభం కాదు.
‘The Palastinian cause is greatest moral issue of our time” Nelson Mandela అనడంలో పాలస్తీనా సమస్య ఎంత సున్నితమైన అంశమో, ఎంత జటిలమైన విషయమో మనకు అవగతమవుతుంది.
ఈ ధరాగోళంపై పాలస్తీనా దేశం అనేక దశాబ్దాలు వైరిపక్షం భూకాంక్షతో, పెద్దతలల స్వార్థబుద్దితో సంఘర్షిస్తూ ఏళ్లుగా ధ్వంసం కాబడుతున్న రావణకాష్టం లాంటిది. అక్కడ ఎంతఘోరమైన, సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నవో పత్రికల్లోను, టీవీవార్తల్లోను చూస్తూనే ఉన్నాం.
మనిషన్నవాడు మధనపడకుండా, చలించకుండా ఎలా ఉండగలడు? ”చివరి ఆకాశం కోల్పోతే, పక్షులు ఎక్కడికి వెళ్తాయి?” అని ప్రశ్నిస్తున్న పాలస్తీనా కవి మహమూద్ దర్వీష్ లాగా సున్నిత హదయం గల కవులు, సాహితీకారులు ఇలాంటి భీకరసందర్భాలకు ఎంతలా చలించిపోయారో, వేదన పడ్డారో, అంతర్మధనం పడ్డారో తెలియాలంటే వర్ధమాన కవి ‘దొంతం చరణ్’ సంపాదకత్వంలో ఇరవై రెండుమంది యువ కవులు పాలస్తీనా దేశానికి సంఘీభావంగా రాసిన యుద్ధ వ్యతిరేక కవితల ‘కలలు చిగురిస్తాయి’ కవితాసంపుటి తిరగేయల్సిందే. అరవైరెండు పేజీలతో కూర్పు, కవర్ డిజైన్ ఇట్టే ఆకట్టుకుంటుంది. సంపాదకుడు దొంతం చరణ్ మాట, ప్రముఖ రచయిత, విమర్శకులు, వీక్షణం పత్రికా ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ గారి ముందుమాట చాలా ఆకర్షణీయంగా, యుద్ధం నేపథ్యాన్ని ఉన్నంతలో సమగ్రంగా మలచి ‘కలలు చిగురిస్తాయి’ కవితాసంపుటిని కవిలోకాన్ని, కవిత్వ ప్రేమికుల్ని, పాలస్తీనా మద్దతుదారుల్ని, యుద్ధం వ్యతిరేకించు సగటు మానవుల్ని చదివించేలా ఉత్సహాపరుస్తాయి. ఈ సంపుటిని పాలస్తీనా పోరాట కవి ‘ఘసన్ కనాఫానీ’కి అంకితమివ్వడం అభినందనీయ విషయం.
ఈ సంపుటిలో అన్నీ కవితలు యుద్ధాన్ని, యుద్ధం వాతావరణాన్ని, అక్కడ దాపురించిన గడ్డు పరిస్థితుల్ని, అందులో చిక్కిశిధిలమవుతున్న పసి వాళ్ళని, పౌరుల్ని, పల్లెల్ని, పట్టాణాల్ని ప్రతిబింబిస్తున్నాయి. వారి కవితా వాక్యాలు యుద్ధక్షిపణిలా మన గుండెలను గురిపెడుతాయి. వాళ్ళ అభివ్యక్తీకరణ భావాలబాంబులై మన మనసులో పేలుతాయి. కదిలిస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. మన హదయాలను ద్రవింపచేస్తాయి. మనలో ఆవేశాన్ని రగిల్చి ఆలోచనను జనింపచేస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
లావణ్య తీగల మొదటి కవిత ‘పాలస్తీనా ప్రేమలేఖ’ను చాలా గొప్పగా కవిత్వీకరించారు.
”ఎదినగిన కొడుకు తుపాకి పట్టుకుని/ దేశానికి రేపటిని హామి ఇచ్చి యుద్ధానికి వెళ్తే/ స్మశానానికి తప్పకుండా తిరిగివస్తాడని/ తల్లుల కన్నీళ్లు చివరి చూపులు కోసం ఎదురుచూస్తున్నాయి”
‘ఇక్కడ పిల్లలే కాదు తల్లులు క్షేమంగా లేరని’ పాలస్తీనీయుల దయనీయ, దుర్భర పస్థితిని మన కళ్లకుకడుతుంది ఈ కవిత.
”నేను ప్రాణంగా ప్రేమించే ప్రాణం లేని ప్రపంచమా/ నా ప్రేమలేఖకు కాస్త ప్రేమను బదులివ్వు” అంటూ బరువెక్కిన హదయంతో ముగించారు లావణ్య తీగల.
రెండో కవితలో మహేశ్ వేల్పుల ప్రియురాలికి ప్రేమతో ఇలా విన్నవించుకున్నాడు
”ప్రియా/ నాకిక్కడా ఇంకేం మిగల్లేదు/ నీతో కలిసి బతకాలంటే ఆశ తప్ప!”
మనం రాసుకున్న ప్రేమలేఖలు ఈ విద్వేషపుమంటల్లో బూడిదయ్యాయని, దేహాలు ఒక్కటైనా దేశాలు వేరని వేదన పడ్డాడు.
”రాకెట్లు విసరబడుచున్నచోట/ కొన్ని నువ్వుల్ని చల్లిపోదాం/ దిక్కులు కూలకుండా/ ప్రేమను అడ్డుపెడదాం” అని తన ప్రేమను అభివ్యక్తీకరించడం చాలా బాగుంది.
మరో కవిత.. ‘ప్రకంపనలు’ లో సభావట్ హథీరామ్… ”ఈ నేల పై/ గన్నులే కాదు/ బన్నులు కూడా / పచ్చి నెత్తుటి కక్కే బాలింతలే” అనడం అక్కడి భీకర పోరు కాలాన్ని తలుచుకుని చింతిస్తూ చిత్రించాడు. ఆ కవితని ఇంకా ఇలా రుధిరవాక్కుల్తో ముగించారు.
”ఇక్కడ/ మా గుడ్డలన్నీ/ నిరసన జెండాలైతే/ మా దేహాలు/ రక్తపు పూతతో/ కప్పబడి ఉంటాయి./ మాటలన్నీ ఖాళీ అయ్యాక/ ప్రదర్శనకు మిగిలిన మట్టి బొమ్మలా/ నేను ఒక యుధ్ధం చిత్రాన్ని గీయడానికి సిద్ధమయ్యాను./ పొగచూరిన బతుకు చిత్రాలలో/ రంగులన్నీ వెలసిపోయి/ నలుపు మాత్రమే మిగిలుంద”ని పి. సుష్మ తన అంతరంగాన్ని వెల్లడించింది ‘మిగిలిపోయిన వర్ణం’ కవితలో.
నవ్వుల్ని శిథిలపరచి, అమ్మలను సమాధి చేశారు కదా మధ్యధరా సముద్రమంటి తన గుండెలోతు బాధను వ్యక్తపరించింది.
”ఇతిహాస ఇతివత్తాలను/ వల్లెవేసే ప్రపంచానికి/ శాంతి గీతం పాడేదెలాగో /ఎవరు నేర్పలేదా?/ చివరగా ఒకటి చెప్పు/ అసలు నీ రంగేమిటి?/ నువ్వు ఎవరు తాలుకా?” అంటూ సూటిగా సుష్మ ప్రశ్నించింది.
ఇది ప్రేమలేఖ కాదు. ఇది ప్రేమ కవిత్వం కాదంటూ ”మనిషికి -మనిషికి మధ్య/ మనిషికి -మతానికి మధ్య/ మనిషికి -భూమికి మధ్య” జరుగుతున్న యుద్ధం తాలూకు అనుభవాల కవిత్వమ’ని కవంటాడు.
”బడుల పై బాంబులు వేసినా/ పసిగుడ్డుల ప్రాణాలు తీసినా/ వాళ్లను ఖననం చేసినా/ ఈ భూమిలో మళ్ళీ మొలకెత్తక తప్పద”ని హామీ ఇస్తున్నాడు మరొక కవి ఉదరు కిరణ్ తన ‘మానని గాయం గాజా’ లో.
దుఃఖం పాలస్తీనా తల్లిగా మాట్లాడుతున్న శ్రావణి పూలవ్ కవిత.
”నా బిడ్డల రంగుల ప్రపంచమంత ఇంకిపోతున్న/ ఈ నేల మీద/ నేనెట్ల సారు స్వేచ్ఛగా నడిచేది” అంటూ ముక్తకంఠతో గట్టిగాప్రశ్నించింది. ఈ దేశంలో నా బిడ్డల బతుకుల్లో శాంతి ఉదయించడం కోసం ఈసారి నా గర్భం పండితే బిడ్డలతో పాటు నేను గన్నులను కంటాను, పెన్నులను కంటానని శ్రావణి అనడంలో ఒకింత పోరుభయం దాగుంది.
దిలీప్ రాసిన ‘రక్త భీభత్స వాకిలి’ కవితలో ”యుద్ధం/ విశ్వవీధిలో/ రక్తపు కళ్ళాపి చల్లి/ చెదిరిపోయిన ముగ్గులో/ చెల్లాచెదురైన చుక్కల్లా” చిత్రమైన దేహాలను మిగులుస్తుందంటాడు.
”మనుషుల్ని ప్రేమించే వాళ్ళు/ యుద్ధాన్ని కాంక్షించరు!/ యుద్ధాన్ని కాక్షించే వాళ్ళు/ మనుషుల్ని ప్రేమించలేరు” అంటూ హితబోధ చేశారు. ప్రేమగలవాళ్ళు త్యాగం చేస్తారు కాని యుద్ధం కాదనేది యదార్థం కదా.
ఉమ ఉత్పలిని రాసిన ‘మనుషులు ఏమైపోయారు’ కవిత… ”మనుషులు ఏమైపోయారు/ నిన్న, మొన్నటి జీవితాన్ని/ నెత్తుటి సంచుల్లోకి పూరిస్తున్నారా/ ఆకాశ శబ్దాల సందుల్లోకి/ గుండె చప్పుళ్ళను చొప్పిస్తున్నారా” అంటూ తెగ మధనపడుతుంది.
కవిత చివర ”ఇలా/ ఇపుడు చెప్పండి/ మనుషులు/ ఏమయ్యారో అనేది ప్రశ్న కాదు/ మనుషుల్ని మీరు ఏంచేశారు” అని? మనల్ని తప్పకుండా ఆలోచింపజేస్తుంది. తిలక్ గారు ‘సైనికుడి ఉత్తరం’లో ”నేనిదివరకటి నేను కాను/ నాకు విలువల్లేవు/ నాకు అనుభూతుల్లేవు/ చంపండం, చావడం/ మీసం దువ్వటం లాంటి అలవాటయ్యింది” అన్న వాక్యాలు స్ఫురణకు తెస్తాయి మనకు.
”కత్తుల కోట కధమారేలా/ నెత్తుటి ఊట ఇంకిపోయేల/ రణపిశాచిని తరిమికొట్టగా/ విముక్తి గొంతుక వినిపించాలె/ నిలపడానికి నాంది పలుకగా/ శాంతి బావుటకూ సలాం చేయాలె” అని ‘కత్తుల కోటలో నెత్తుటి వేట’ కవితలో రాజేశ్ ఆశాభావంగా అక్షరీకరించిన తీరు అమోఘం..
Blood lake in Battle అనే శీర్షికతో శివకుమార్ గౌడ్ తాళ్ళపల్లి గొప్ప కవిత రాశారు. తను పేపర్ చదువుతున్న సందర్భంగా తన పాలస్తీనా దేశం గురించి మనసులోని భావాలను వ్యక్తంచేశాడు ఇలా.
”పేపర్లోకి చూస్తే/ దాని నిండా పాలస్తీనా అక్షరాలే/ గాజా చప్పుల్లే” అంటారు. పసి పిల్లాడి చేతిలో గాలి బుగ్గలు పగిలినట్టు అక్కడ తలలు ముక్కలను తున్నాయి అని బాధపడ్తాడు.
”గాజాలో సమాధులు అక్కర్లేదు/ బాంబులు చేసిన గుంతలే/ వాళ్ళకి శవపేటికలు” అని తన ఆవేదనను అభివక్తీకరించిన విధం మనలను ఉన్నఫళంగా చలింపజేస్తుంది.
శశిధర్ నాలిక మరో మంచి కవిత పేరు ‘కాసేపు నిద్రపోనివ్వు’.
”వాడి ముఖం ఎర్రగా ఉందని భయపడిపోకు/ అది తూటా తగిలి గుండెను చీల్చినా వాడి నాన్న రక్తం/ తుడవబోకు, మళ్ళీ వాడు లేస్తే/ మళ్లీ వాడు భయపడితే నిద్రపుచ్చడానికి ధైర్యం చెప్పడానికి/ వాడి నాన్న లేడు./ తల లేని వాని తల్లి నేలకొరిగింది/ ఇప్పుడు వాడికి పాలు కరువు/ యే మధ్య రాత్రైనా మేలుకొస్తే/ వాడికి కొంచం మద్యం పట్టివ్వు”
ఈ కవితా పంక్తులు పాలస్తీనాదేశపు భీకరపరిస్థితులకు పరాకాష్ట. ఇవి తప్పకుండా మన గుండెల్ని మెలిపెడ్తాయి. మన మనసుని తప్పకుండా కదిలిస్తుంది.
శశిధర్ ఎంతో మధనపడుతూ కవితను ఇలా ముగింపు పలికారు… ”ఈ రాత్రి రాత్రిలానే ఉంటే ఎంత బాగుండు/ పగలైతే మళ్ళీ యుద్ధం/ వాడి కలలు దగ్ధం/ వాడి దేశం దుర్గం/ వాడి జీవితం దుర్భరం”
రామ ఫణీంద్ర పోశింశెట్టి ‘ఏ దేశం ప్రజల తరుపున’ కవితలో ఇలా యుద్ధాన్ని ఎంతో వేదనతోవర్ణిస్తున్నారు.
”ప్రాణాలు పూలల్లా రాలిపోతుంటే/ కన్నీళ్లు వరదలై పారుతుంది/ కాపాడండన్న పిల్లల ఆర్తనాదం/ ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తుంది/ నేను త్రాగే నీటిని చూస్తుంటే/ నాకు యుద్ధపు రక్తమే కనబడుతుంది/ ఈ నెత్తుటి నదిచుట్టూ/ ఎంత నాగరికత ప్రవహించిన/ మానవ ద్రోహానికి ప్రతీకే అంటూ/ యుద్ధాలు చేసి/ ఎన్ని దేశాల్ని ఆక్రమించినా/ చివరకు ఓడిపోయేది/ మానవత్వమేనని అభిప్రాయపడ్డది”
మూల వేణు ఇలా తన బాధను అభివ్యక్తం చేశాడు… ”బిడ్డలు లేని తల్లులు, తల్లులు లేని బిడ్డలనడం” పాలస్తీనాలో నెలకొన్నదుర్భర పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇక్కడ పారుతున్న నెత్తుటి నదులను చూసి, అక్కడ సముద్రం కూడా కన్నీరుపెడుతోందని గంభీర స్వరమై పలికారు.
”ఒక్క క్షణం/ కనుచూపు మేరలో అంతా విధ్వంసం/ తెరవడానికి కళ్ళు కూడా కనబడటం లేదు/ అధికార మధం కోసమా?/ అభాగ్యులు చావులు కోసమా?/ ‘ఓ యుద్ధమా నువ్వు ఎవరికోసం…?(కవితా శీర్షిక)” అంటూ నినదించాడు మూల వేణు.
యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా దేశం… ఆ నేల ఎలాఉంటుందో తెలువదు గాని ఆకలి పేగుల ఆర్తనాదాలు పొక్కిలై పారుతున్న దుఃఖమును వాగులుగా ”ఇంకా.. ఇలా/ గాయపడిన గుండెలకు లేపనంగా/ ఓ పాట రాసి పంపాలని ఉంది/ అహంకార అధిపత్యానికి ప్రతిపక్షంగా/ చైతన్య గీతం రాయాలని ఉంది/ భయంకరమైన వాతావరణం అలుముకున్న/ ఆ బిడ్డల పిండికిళ్ళకు సత్తువనిచ్చే/ తిరుగుబాటు గేయం ఒకటి రాయాలని ఉంది/ నాకు గాజా వెళ్లాలని ఉంద”ని మల్లెమోని శ్రీకాంత్ కవిత్వీకరించిన తీరు మనల్ని కదిలిస్తుంది.
దామెర్ల హష్మీ బాబు కవిత ‘లాంగ్ లీవ్ పాలస్తీనా’ లో ”ఆకలి కేకలు ఒకవైపు/ కాలుతున్న శవాలు మరోవైపు/ పాలస్తీనా రక్తపు మడుగులో తడిసి/ జీవచ్చవమయి విలపింస్తుంంటాడు/ ఇప్పటికీ మచ్చుకైనా శాంతి కనపడడం లేదని/ ఇపుడు వారి కోరిక ఒకటే స్వేచ్ఛా!” అని ఆకాంక్షిస్తున్నాడు.
మరో కవిత సునీత దుర్గం ”ఓరు శాంతి/ ఓరు శాంతి!!/ దగ్గర ఉండటం అంటే/ మనుషులకు లోకువనుకొని ఉంటావ్ కదూ/ ఇంత దారుణం జరుగుతున్నా/ అంత దూరాన ఉంటావా/ మా … శాంతి.. ప్లీజ్ / ఈ ఒక్కసారి వచ్చి పోరాదు..” ఎండమావైన ‘శాంతి’ని రమ్మని హద్యంగా పిలిచింది.
బాజీ బాబుకవితా శీర్షిక ‘గాజాలో నా గది’. ఇందులో తనగది ఒకప్పుడు పుస్తకాలతో నిండుగా ఉండేది. ఇప్పుడు ఇలా ఉందంటాడు.. ”శిథిలావస్థలో ఉన్నగదిలో/ రక్తపు మడుగులో నేను/ కొన ఊపిరితో ఉన్న నేను/ ప్రపంచం ముందు/ ఒక అనాధగా మిగిలాను” అని కుములిపోతాడు.
పై పంక్తులు అక్కడి భీతావహ దశ్యాన్ని మనకు చూపిస్తుంది. మునుపటిలా కాదు రోజులు మారాయి. మిగిలి ఉన్న మా తరం, రాబోయే తరం పోరాటం చేస్తాయని నమ్ముతాడు ఈ యువకవి. కవిత ముగింపు ఇలా చేశాడు…
”శిథిలావస్థలో ఉన్న/ మా పాలస్తీనా/ పచ్చని వెలుగులు/ పులుముకుంటూ/ స్వేచ్ఛగా తలెత్తుకు నీలబడే వరకు/ మా పోరాటం/ కొనసాగుతతూనే ఉంటుంద”నడంలో … ప్రముఖ కవి నందిని సిధారెడ్డి గారు ‘భూమి స్వప్నం’లోని పాలస్తీనా కోసం కవితలోని ”రక్తం చెల్లించాల్సే ఉంటుంది/ ఎవరు ఏ మట్టిని విముక్తం చెయ్యటానికైనా/ ఎంతో కొంత రక్తం చెల్లించాల్సే ఉంటుంది/ పాలస్తీనా! ఆయుధం వెనక్కి తీసుకోవద్దు!” కవితా పంక్తులను గుర్తు చేస్తున్నాయి.
కలీం ‘యుద్ధమే విధ్వంసం’ పాలస్తీనాలో బాల్యంగురించి ఇలా బాధను వ్యక్తం చేశాడు… ”బాంబులు మధ్య చిక్కుకొని/ బాల్యం విలవిలలాడుతూ ఛిద్రమవుతుంది./ బడికెళ్ళాల్సిన బాల్యం/ శవాల కుప్పలుగా మారిపోతుంది”
పాలస్తీనా బాల్యాన్ని అమెరికా అండతో ఇజ్రాయెల్ మింగేస్తుందని ఎంతో దుఃఖంతో కవిత మలిచిన తీరు బాగుంది.
గూండ్ల వెంకట నారాయణ రాసిన అద్భుతమైన కవిత పేరు… ‘పాలస్తీనా’.
ఈ నేల ఎంత అవసరమో భూమిని కోల్పోయే వాడికి తెల్సంటాడు. ”పోరాటం అనివార్యం అయ్యాక ప్రాణాలు ఒక లెక్కా” . ఈ ఒక్క వాక్యం చాలు పాలస్తీనా భూభాగం, ప్రాణాలను రక్షించుకోవడానికి దేశీయుల మనస్సును ఆవిష్కరిస్తుంది.
”అవును! ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అని తెలుసు/ కానీ బలహీనులు పోరాటం చేయటాన్నే నేను చరిత్ర అంటాను” అంటూ గొప్పగా కవి గూండ్ల వెంకట నారాయణ ఎలిగెత్తాడు.
బాలు అగ్నివేష్ కవిత ‘పాలస్తీనా నువ్వు నించో..’ లో ”గుక్కెడు నీళ్లు లేని నేలలో/ ఇప్పుడు పోరాటం ఆగిపోయిన పసి గుండెలకై/ నినాదం ఎవరు ఇస్తరు దేశమా…/ సూర్య కిరణాలు పడ్తూ శిథిల భవనాలు మెరుస్తున్నాయి..” అంటాడు.
”గాయాల్నిమాన్పేసే రోజులు/ తిరిగి నువ్వుల్ని వెలిగించే రోజులు/ నీ కోసం వస్తాయి/ పాలస్తీనా నీకు విజయపు ప్రేమలు” అని కవి తన ఆశావాహ దక్పథం వెల్లడించడం మనల్ని ఆకట్టుకుంటుంది.
పేర్ల రాములు రాసిన ‘పిల్లల కలల్లోంచి’ కవితలో ”భూమి మీద తిరిగే మనుషుల్ని/ బూడిద కుప్పలుగా ఎలా చూడగలం/ మనుషులు మాట్లాడుకోవాల్సిన చోట/ బాంబులు మాట్లాడుతున్నాయి/ ఎంత కఠినమైన శబ్దాలు అవి/ పిల్లలేమవ్వాలని/ పిల్లలు పెంచుకొనే బొమ్మలేమవ్వాలని” ఎంతో వేదన చెందుతాడు.
”పిల్లలూ క్షమించండి/ ఇప్పటికైతే మన్నించండి/ మీ బాల్యాన్ని రాయలేకపోతున్న/ చిక్కటి పొగల మధ్య/ మిమ్మల్ని కాపాడుకోవడానికి/ ఎదురు నడుస్తున్న” అంటూ భరోసా కల్గిస్తానంటూ కవిత్వీకరించాడు.
చిట్టచివరి కవిత ‘కలలు చిగురిస్తాయి’ ఈ సంపుటి సంపాదకుడు దొంతం చరణ్ కవిత’ శూన్యాన్ని చాటాలని కోరిక’.
ఎన్నెన్నో ఆలోచనలు. ఏవేవో చప్పుళ్ళు. నిద్రపట్టడమే లేదు. ఆకుపచ్చ పిసరంత కూడా కానరానంత ఎడారిని, పాలస్తీనా యుద్ధం వాతావరణాన్ని మనకు చూపించి గుండెబరువెక్కిస్తాడు.
”నిధులన్నీ బావిలో దాగినట్టు/ అమ్మకళ్ళల్లో నా అందాలన్నీ నిండి వున్నాయి/ బాంబులు/ నా అందాన్ని చిదిమి వేయడం/ మా అమ్మకు ఇష్టం లేనట్టుంద”ని తన హదయాన్ని ఆవిష్కరించిన తీరు గొప్పగా ఉంది.
”కొన వూపిరి తో కొట్టుమిట్టాడుతున్న/ నాతోటి పిల్లలందరికీ/ ఓ మాట చెప్పాస్తాను../ అమ్మ కళ్ళలోకి/ ఓసారి తొంగి చూడండి” అని కవితని ముగింపుచేస్తూ మన కళ్ళలో ఉబికే కన్నీరవుతాడు చరణ్.
ఆధునిక ప్రపంచంలో ఏ దేశమూ యుద్ధాన్ని ఆహ్వానించదు. ఆశించదు. హర్షించదు. దేశసరిహద్దుల సమస్యలు దేశపాలకులకు సవాల్ విసురుతుంటాయి. కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి.
అలవికాని దేశాధినేతల ఆకాంక్షలు, చాపకింద నీరు లాంటి ఏ ఇతరదేశాల వ్యాపారధోరణో, రాసుకున్న శాంతి ఒడండికలు కాలరాయడమో, ‘బాంబులు ఎందుకు యుద్ధం చేయడానికి/ యుద్ధమెందుకు బాంబులమ్మడానికి’ లాంటి సిగ్గులేని పరిస్థితులో రణం రగులుకుంది. పాలస్తీనా దేశం యుద్ధం కౌగిట విలవిలలాడుతోంది. పౌరులకు ప్రాథమిక హక్కులులేవు, ప్రాణాలకు దిక్కులేదు. ఎంత అమానవీయం, ఎంత దయనీయం. ఇంతటి మారణహౌమంలో బాంబులు, మోర్టాల్లు, క్షిపణుల దాడుల కర్కశ రోజుల్లో మనగల్గడం ఎంత ఘోరమో మనకు అర్థమవుతుంది.
చీలిదేశ ప్రసిద్ధకవి ప్లాబిడో నెరుడా ‘you can cut all the flowers but you can not stop spring అన్నట్టు పాలస్తీనీయుల పోరాటం ఆగరాదు. వాళ్ళ చిరకాల అస్తిత్వ ఆకాంక్షనెరవేరాలి. మనమంతా పాలస్తీనా దేశంపై యుద్ధాన్ని వ్యతిరేకించడం శతశాతం సమంజసం. అత్యంత అవసరం. అంతర్జాతీయ సమాజం ఇందుకు చొరవ తీసుకోవాలి. ఐరాస దానికి నాయకత్వం వహించడం అత్యంత ఆవశ్యకం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా యువకవి దొంతం చరణ్ సంపాదకత్వంలో ‘కలలు చిగురిస్తాయి’ కవితా సంపుటి తీసుకురావడం తద్వారా ప్రజల్లో, కవుల్లో చైతన్యం కల్గించే ఈ క్రతువు తప్పకుండా మహౌన్నతమైనది. ఈ సంపుటిని మనమందరం చదవాల్సిన బాధ్యత, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించే కర్తవ్యం మనపై ఎంతైనా ఉంది. దొంతం చరణ్, యువకవులందరికీ హదయపూర్వక శుభాభినందలు.
– రమేశ్ నల్లగొండ
8308452179