గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

డిమాండ్లు…
జీవోనెంబర్‌ 60 ప్రకారం నెలకు స్వీపర్లకు రూ.15,600, పంప్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు రూ.19,500 వేతనంగా నిర్ణయించాలి. లేదా పీఆర్సీ మినిమం బేసిక్‌పేను రూ.19 వేలు చెల్లించాలి. ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వేతనాలివ్వాలి. సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలి.
జీవోనెంబర్‌ 51ని సవరించాలి. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి.
పంచాయతీల్లో అవసరాన్ని బట్టి డీపీవో అనుమతి ప్రకారం కొత్త నియామకాలు చేసి, వేతనాలు పెంచాలి. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాదబీమా, గ్రాట్యూటీ, వారాంతపు సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలి. గుర్తింపు కార్డులివ్వాలి. ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలు చేయాలి.
ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం రూ.10 లక్షలివ్వాలి. ఇన్సూరెన్స్‌ రూ.5 లక్షలతోపాటు ఒకరికి ఉద్యోగమివ్వాలి.
అక్రమ తొలగింపులు ఆపాలి. యూనిఫారం, చెప్పులు, సబ్బులు, గ్లౌజులు, మాస్క్‌లు తదితర సౌకర్యాలు కల్పించాలి.
మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి– సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామపంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరిం చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు.రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీల్లో 50 వేల మంది సిబ్బంది పారిశుధ్యయ కార్మికులు, స్వీపర్లు పంప్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లుగా వివిధ కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. పంచాయతీల్లో జీవోనెంబర్‌ 51 ద్వారా మల్టీ పర్పస్‌ విధానాన్ని తెచ్చి కేటగిరీలను రద్దు చేసి నైపుణ్యం రకరకాల పనులు చేయించడం వల్ల కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారనీ, ప్రాణాలు కోల్పోతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. నష్టపోయిన కుటుంబాలకు కనీసం పరిహారమైనా ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పంచా యతీలకు జనాభాను బట్టి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామనీ, కొత్త చట్టం రూపొందించి పటిష్టం చేస్తామని వేతనాలు పెంచి వారికి ప్రత్యేక తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. జీవోనెంబర్‌ 60 ప్రకారం నిర్ణయించిన వేతనాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. పంచాయతీల్లో పెరుగుతున్న జనా భాకు అనుగుణంగా కొత్త నియామకాలు చేసు కుంటూ పాత కార్మికుల వేతనాలే కొత్తవారికి పంపకాలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వానికి, అధికారులకు అనేక విజ్ఞప్తుల తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గురువారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నారని తెలిపారు.
కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని గ్రామాలను శుభ్రం చేసి అద్దంలా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాలను కాపాడు తుంటే ప్రభుత్వం వారిపట్ల వివక్షత చూపడం తగదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love