– సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం
– హయ్యర్ పెన్షన్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి : సదస్సులో ఎఐఆర్‌డబ్ల్యుఎఫ్ జాతీయ కార్యదర్శి విఎస్ రావు
కర్నూలు : హయ్యర్ పెన్షన్ వాటా రాబట్టుకోవడానికి సంఘటితంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఆర్‌టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ పెన్షన్ పథకం 1995లో సుప్రీంకోర్టు తీర్పు అమలు మేరకు ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ‘సుప్రీంకోర్టు తీర్పు అమలు హయ్యర్ పెన్షన్ సమస్యలు’ అనే అంశంపై కర్నూలు కార్మిక కర్షక భవన్లో ఆదివారం రాష్ట్ర ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర కోశాధికారి జె దివాకర్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విఎస్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లక్షలాదిమంది హైయర్ పెన్షన్ పొందడానికి అనేక ఆటంకాలున్నాయని, వీటిని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇపిఎఫ్‌ఒ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. అస్తవ్యస్త విధానాల కారణంగా కొంతమంది సకాలంలో దరఖాస్తు చేసుకోలేక హయ్యర్ పెన్షన్ అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కార దిశగా వ్యవహరించడంలేదని అన్నారు. ఎస్‌డబ్ల్యుఎఫ్ ఇప్పటికే అనేక అంశాలను ఇపిఎఫ్‌ఒ ప్రాంతీయ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందన్నారు. హయ్యర్ పెన్షన్ పొందడానికి, న్యాయంగా రావలసిన వాటా రాబట్టుకోవడానికి సంఘటితంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో రాష్ట్ర ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు హక్కుగా ఉద్యోగ కార్మికుల చెల్లించాల్సింది పోయి, అనేక అడ్డంకులను సృష్టించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. రూ. లక్షల కోట్లు పోగుబడిన పెన్షన్ నిధులను కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించి షేర్ మార్కెట్లో పెట్టి వ్యాపారం చేయడం దారుణమన్నారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజి బాబు, ఎస్‌డబ్ల్యుఎఫ్ జిల్లా కార్యదర్శి విఎస్ రాయుడు, జిల్లా నాయకులు కెసి.శేఖర్, బి.నాగరాజు, ఎ. దేవరాజు, ఎస్.హనుమంత ఆర్‌టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు జి శ్రీనివాసులు, ఎస్‌ఎస్ రావు, ఎస్ సాంసన్, రిటైర్డ్ పేపర్ మిల్లు యూనియన్ నాయకులు రామాంజనేయులు, గ్లాస్ ఫ్యాక్టరీ రిటైర్డ్ యూనియన్ నాయకులు కె సుధాకరప్ప, కర్నూలు, నంద్యాల,అనంతపురం జిల్లా పెన్షనర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.