ఏపీలో పట్టు కోసం పాట్లు

Songs for grip in AP– పెరుగుతున్న లోకేశ్‌ జోక్యం
– బీజేపీ నేతలతో పవన్‌ మంతనాలు
అమరావతి : ప్రభుత్వంలో, కూటమిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ జోక్యాన్ని తగ్గించేందుకు, ఆయన ప్రమేయాన్ని కట్టడి వేయించేందుకు ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ కేంద్రంలోని బీజేపీ పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ ఇటీవలి ఢిల్లీ పర్యటన అజెండాలో ఈ అంశమే ప్రధానంగా ఉందని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న లోకేశ్‌ తతిమ్మా మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో వేలు పెడుతున్నారని, మంత్రుల కార్యాలయాల్లో సిబ్బందిని నియమించే విషయంలో కూడా తాను చెప్పిన వారినే వేసుకోవాలనే వరకు లోకేశ్‌ జోక్యం వెళ్లిందని పవన్‌, కొందరు జనసేన ముఖ్య నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పవన్‌ నిర్వహిస్తున్న పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు మినహా తతిమ్మా అన్నింటిలోనూ లోకేశ్‌ తన ముద్ర ఉండాలని ప్రయత్నిస్తున్నారని ఆరటున్నారు. లోకేశ్‌ జోక్యం మితిమీరుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయడం లేదన్న భావన జనసేన చీఫ్‌లో ఉందని చెబుతున్నారు. దీంతో బీజేపీి కేంద్ర పెద్దల సహాయాన్ని కోరినట్లు సమాచారం. కాగా పవన్‌ అప్పీల్‌పై కేంద్ర బీజేపీ పెద్దలు ఆలకించినప్పటికీ ఆచితూచి అడుగేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ఆది నుంచీ!
ఎన్నికల్లో కూటమి అసాధారణ విజయం అనంతరం క్యాబినెట్‌ కూర్పు సమయంలోనే పవన్‌కు కేటాయించాల్సిన శాఖ, ఇవ్వాల్సిన హోదాపై టీడీపీ లో చర్చ జరిగిందని చెబుతారు. కేబినెట్‌లో లోకేశ్‌కు, పవన్‌కు ఒకే హోదా ఇవ్వాలని టీడీపీ నేతల్లో చాలామంది కోరుకున్నారని సమాచారం. అప్పటి పరిస్థితులు, బీజేపీి సూచనల మేరకు పవన్‌కు డిప్యూటి సీఎం హోదా ఇచ్చారు. లోకేష్‌ను క్యాబినెట్‌ మంత్రిని చేశారు. కాగా, లోకేశ్‌ నేరుగా ప్రజల నుంచి టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించడం మొదలు పెట్టాక పోటీగా పవన్‌ కూడా జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాల స్వీకరణ ప్రారంభించారు. అనంతరం ఇతర మంత్రులూ ఈ పని చేస్తున్నారు. మంత్రుల కార్యాలయాల్లో కాకుండా పార్టీ కార్యాలయాల్లో ప్రజా దర్బారులు నిర్వహించడంపై విమర్శలొచ్చాయి. ఇదిలా ఉండగా అన్ని శాఖల్లోనూ లోకేశ్‌ నేరుగా జోక్యం చేసుకోవడంపై పవన్‌ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
‘రాజ్యసభ’తో మరింతగా…
రాజ్యసభ సభ్యుల ఎంపికలో పవన్‌ సోదరుడు నాగబాబుకు నో చెప్పి లోకేశ్‌ తన ప్రధాన అనుచరుడు సతీష్‌కు ఇప్పించుకోవడంతో వ్యవహారం ముదిరింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీడీపీ చేసిన ప్రకటన వెనుక పవన్‌ పట్టుదల, బీజేపీి డైరెక్షన్‌ ఉందని చెబుతున్నారు. లోకేశ్‌ నిర్వహిస్తున్న విద్యాశాఖ సలహాదారుగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు నియామకం వెనుక బీజేపీిి, వవన్‌ పాత్ర ఉందని సమా చారం. చంద్రబాబే పదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటారని ఇటీవల అసెంబ్లీలో, తనకు బాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విజన్‌ – 2047 డాక్యుమెంట్‌ విడుదల సందర్భంగా పవన్‌ వ్యాఖ్యలు పరోక్షంగా లోకేశ్‌ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికేనని కూటమి పార్టీల్లోని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

Spread the love