పోరాట జెండాతోనే పేదలకు జాగాలు

– పాలకుల మెడలొంచి సొంతింటి కల నెరవేరుస్తాం… మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం
‘నవతెలంగాణ’తో ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
”చరిత్రలో మార్పు అనేది ఉద్యమాల ద్వారానే వచ్చింది. కానీ ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటంపై జగిత్యాల, హనుమకొండలో పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. బైండోవర్‌ కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు. నిర్బంధాలతో పాలకులు ఉద్యమాలను ఆపలేరు.. గతంలో వరంగల్లో 30 వేల కుటుంబాలకు ఇంటి స్థలాలు రావడానికి ఉద్యమాలే కారణం. ఇప్పుడు వారి పిల్లలు కూడా మాకు జాగ కావాలంటూ ఉద్యమాలలో కలిసి వస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి పేదల సొంతింటి కల నెరవేరుస్తాం” అని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం సాగుతున్న రాష్ట్ర వ్యాప్త బస్సు జాతాలో భాగంగా వారిని నాగర్‌కర్నూల్‌లో ‘నవతెలంగాణ’ మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి పరిపూర్ణం పలకరించారు. ఈ సందర్భంగా ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటాలను ప్రత్యేకంగా వివరించారు.
పేదల పక్షాన పోరాడుతున్న ఎర్రజెండాకు బాధితుల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది.
కంట కన్నీరు తప్ప గత్యంతరం లేని పేదలు బస్సు జాతాను చూడగానే దండం పెడుతున్నారు. ఇప్పటివరకు మా దగ్గరకు ఎన్నికల సందర్భంగానే వచ్చారు తప్ప మా యోగక్షేమాలు ఎవరూ చూడలేదు అంటున్నారు. కంటకన్నీరు పెడుతున్న పేదలను ఓదార్చుతున్నాం. ఏడ్వడం కాదు.. ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం. మీ సొంతింటి కల నెరవేరే దాకా ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చాం. పేదలు వేసుకున్న గుడిసెల దగ్గరే రాత్రిపూట మేమూ బస చేశాం. వారు పెట్టింది తిన్నాం.. అక్కడే పండుకున్నాం. గుడిసె కేంద్రాలలో ఉంటున్న పేదలకు ఆస్తులు లేవు. అందుకే సొంత ఇంటి జాగాను ప్రభుత్వం ఇచ్చి.. అక్కడే రెండు పడకల గదుల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం.
తెలంగాణలో సొంత ఇంటి జాగా కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తుందని మీరు ఊహించారా ?
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని అనుకున్నాం. మౌలిక వసతులు ఏర్పడి ఆర్థికంగా పేదలు బలోపేతం అవుతారని ఊహించాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. 125 గజాల జాగా కోసం ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంకా 100 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే సెక్రటేరియట్‌ను కూల్చారు. దాని స్థానంలో వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నూతన సచివాలయం నిర్మించారు. పేదల సొంతింటి నిర్మాణం మరిచారు. దేశ ప్రధాని మోడీ సొంత ఇంటి నిర్మాణం కోసమే రూ.467 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పేదల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది.
ప్రభుత్వ నిర్బంధాన్ని ఎలా ఎదుర్కొంటారు ?
ప్రపంచంలో ఏ చరిత్ర తిరిగేసినా ఉద్యమాలు లేకుండా విజయాలు సాధించలేదు. పోలీసులు తుపాకులతో వచ్చినా ప్రజలను ఏమీ చేయలేరు. హక్కులు అడిగితే ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది.
బస్సు జాతా సందర్భంగా మహిళలు ఎలా స్పందిస్తున్నారు ?
పట్టణాల్లో, గ్రామాల్లో ఏ మహిళను కదిలించినా కన్నీటి గాదే.. ఏ గుండెను తట్టినా విషాదాలే.. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఇంటి జాగా కోసం ఉద్యమాలలో కలిసి వస్తాం అంటున్నారు. చేతినిండా పనిలేని, కడుపునిండా బువ్వ లేని పేదలు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా గూడు లేక అనేక అవమానాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం, మహిళల కోసం పనిచేయడం లేదు. ఎన్నికల కోసం వచ్చే వారిని నిలదీయాలి. పేదలకు రాష్ట్రం 5లక్షలు, కేంద్రం రూ.10 లక్షలిచ్చి సొంత ఇంటి నిర్మాణం జరిగేలా చూడాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతోపాటు మహిళలను చైతన్యం చేసే దిశగా పోరాడుతున్నాం.
మహిళా సమస్యల పట్ల మీరు ఎలా ఉద్యమిస్తారు ?
రాష్ట్రంలో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అకారణంగా దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా వివక్ష ఎక్కువగా ఉంది. అందుకే స్త్రీలు అక్షరాస్యత పెంపొందింపజేసుకొని వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది. మహిళా చైతన్యం ద్వారానే మహిళా సమస్యలు పరిష్కారమౌతాయి.

Spread the love